బిగ్‌బస్‌ -3లో వివాదాస్పద నటి?

బిగ్‌బస్‌ -3 లో వివాదాస్పద నటి శ్రీరెడ్డి పాల్గొననున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం హోరెత్తుతోంది. ప్రముఖ నటుడు, మక్కళ్‌నీదిమయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాలిటీ షో బిగ్‌బాస్‌. ఇప్పటికే రెండు సీజన్లు జరిగిన షో కార్యక్రమం సీజన్‌-3 జూన్‌ రెండో వారంలో ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి కమలహాసన్‌ నటించిన ప్రోమోను కూడా విడుదల చేశారు. తాజాగా నటి శ్రీరెడ్డి ఈ షోలో పాల్గొంటున్నట్లు సమాచారం. అందుకు సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నాయట.

శ్రీరెడ్డి గతంలో టాలీవుడ్‌లో తనతో లైంగిక చర్యలకు పాల్పడిన వారిలో కొందరి పేర్లు బయటపెట్టడంతో పాటు వారిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ అర్ధనగ్నంగా నడిరోడ్డుపై దీక్ష చేపట్టింది. ఆ తరువాత చెన్నైకి మకాం మార్చి కోలీవుడ్‌ సినీ ప్రముఖులపై ఆరోపణలు చేసి వివాదాంశ నటిగా వార్తల్లోకి ఎక్కింది. ఇక బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షో శ్రీరెడ్డి ఎంట్రీ ఇస్తే ఇక వీక్షకులకు ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంటే. అయితే దీనిపై శ్రీరెడ్డి ఇంకా స్పందించలేదు.

తాజాగా ప్రారంభం కానున్న బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షో సీజన్‌-3లో పాల్గొనే వారి ఎంపిక జరుగుతోంది. ఇప్పటికే ఒరుకల్‌ ఒరుకన్నాడీ చిత్రంలో నటుడు సంతానంకు జంటగా నటించిన జాంగిరీ మధుమితను ఎంపిక చేసినట్లు తెలిసింది. కాగా బిగ్‌బాస్‌ రియాలిటీ షో సీజన్‌ ఒకటిలో నటి ఓవియ వివాదాస్పద చర్యలతో బాగా పాపులర్‌ అయ్యింది. అయితే ఆ షోలో విన్నర్‌గా మాత్రం ఆమె లవర్‌గా పాపులర్‌ అయిన నటుడు ఆరవ్‌ గెలుచుకున్నాడు. అలాగే సీజన్‌-3లో నటి ఐశ్వర్యదత్తు, యాషికలు పాపులర్‌ అయ్యారు. అయితే ఆ షోలో నటి రిత్విక విన్నర్‌గా నిలిచింది.