శ్రియకు ఆ ఛాన్స్ దక్కుతుందా..?

దక్షిణాది సినిమాల్లో అగ్ర హీరోయిన్ గా వెలుగొందిన నిన్నటి తరం నాయిక శ్రియ ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. గతంలో చిరంజీవితో ‘ఠాగూర్’, బాలకృష్ణతో ‘చెన్నకేశవ రెడ్డి’, వెంకటేష్ తో ‘సుభాష్ చంద్రబోస్’, అలానే నాగార్జునతో కూడా ఓ రెండు, మూడు సినిమాల్లో
నటించింది. ఆ తరువాత కొత్త హీరోయిన్స్ రావడంతో శ్రియకు తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో తమిళ సినిమాలపై దృష్టి పెట్టింది. అక్కడ టాప్ హీరోలతో కలిసి జత కట్టిన శ్రియ ఇటీవల తెలుగు సినిమాల్లో కూడా మళ్ళీ అవకాశాలు దక్కించుకుంటోంది.

ఈ మధ్య వెంకటేష్ తో కలిసి ‘గోపాల గోపాల’, నాగార్జునతో ‘మనం’, రీసెంట్ గా బాలకృష్ణతో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాల్లో నటించింది. ఈ మూడు సినిమాలు కూడా అమ్మడుకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక రీఎంట్రీలో ఆమె నటించాల్సిందల్లా మెగాస్టార్ చిరంజీవి తోనే.. ఆయనతో కూడా ఓ సినిమా చేసేస్తే.. ఇక రీఎంట్రీలో కూడా స్టార్ హీరోలతో కలిసి నటించిన అరుదైన రికార్డ్ శ్రియకు దక్కడం ఖాయం. చిరంజీవి కూడా ఇప్పుడు సినిమాలపై దృష్టి పెట్టారు కాబట్టి ఆ ఛాన్స్ ఆమెకు దక్కుతుందో.. లేదో.. చూడాలి!