సన్నీలియోన్ సివిల్ ఇంజినీరింగ్‌లో టాపర్..!

ఎక్కడో మారుమూల గ్రామంలో సెలబ్రిటీలకు ఓటరు కార్డు ఉన్నట్టు వార్తల్లో రావడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. ఇలాంటి వార్తలు అప్పుడప్పుడు రావడం… పొరపాట్లను సరిచేస్తామని అధికారులు చెప్పడం కూడా మామూలే. అయితే ఏకంగా ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్‌లో ఓ సెలబ్రిటీ మెరిట్ లిస్టులో టాప్ పొజిషన్‌లో నిలవడం మాత్రం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే. బీహార్ ప్రజా వైద్య ఇంజినీరింగ్ శాఖ మెరిట్ లిస్టులో ఇలాంటి ఆశ్చర్యకరమైన పేర్లు దర్శనమిచ్చాయి. ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన వ్యక్తి పేరు సన్నీ లియోన్ కావడం చాలామందికి షాక్ ఇచ్చింది.

బీహార్ ప్రజా వైద్య ఇంజనీరింగ్ శాఖ అధికారిక వెబ్ సైట్‌లో జూనియర్ సివిల్ ఇంజినీర్‌గా 27 ఏళ్ల సన్నీ లియోన్ టాప్ పొజిషన్‌లో ఉన్నట్టు చూపించింది. సన్నీ లియోన్ తండ్రి పేరు లియోనా లియోన్ అని పేర్కొంది. వెబ్ సైట్‌లో చూపించిన దాని ప్రకారం సన్నీలియోన్ 98.50 శాతం మార్కులు 73.50 పాయింట్లతో టాప్ పొజిషన్‌లో నిలిచింది. అయితే సంబంధిత శాఖ అధికారులు మాత్రం ఈ లిస్టు తాము ప్రచురించింది కాదని స్పష్టం చేశారు. ఇది ఆకతాయిలు చేసిన పని అని వెల్లడించారు. ఈ జాబితాలో మూడో కాలమ్‌లో అభ్యర్థి పేరుతో పాటు అతడి తండ్రి పేరుతో ఉన్న కాలమ్‌లో కొన్ని అర్థం లేని ఇంగ్లీష్ పదాలను పొందుపర్చారు.