థియేటర్ లో ‘జనగణమన’ ఇక ఉండదు!

సుమారుగా 11 నెలల క్రితం థియేటర్ లలో జాతీయగీతం ప్రదర్శించే విధంగా ఓ రూల్ ను ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. అయితే దీనికి వ్యతిరేకంగా చాలా మంది కోర్టులో పిటిషన్లు వేశారు. ప్రభుత్వం విధించిన నిబంధనల్ని సవరించాల్సిందిగా కోరారు. ఈ విషయంపై స్పందించిన సుప్రీం కోర్టు.. థియేటర్లలో జాతీయ గీతం ఆలపించినప్పుడు లేచి నిలబడని వారికి దేశభక్తి లేదనడం సమంజసం కాదని స్పష్టం చేసింది.

ప్రేక్షకులు వినోదం కోసం సినిమా చూడడానికి వెళ్తారు. స్పోర్ట్స్ కు సంబంధించిన కార్యక్రమాల్లో జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నారు కదా.. ఇక సినిమా థియేటర్ లో ప్రదర్శించాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని వెల్లడించింది. జాతీయ గీతాన్ని పాడితే దేశభక్తి ఉన్నట్లు కాదు.. స్వతహాగా అది రావాలి. అంతేకాని ఎవరి మీద దేశభక్తిని బలవంతంగా రుద్దలేము. రేపు మరికొంతమంది థియేటర్ లో జాతీయగీతం వేస్తారు కాబట్టి టీషర్టులు, షార్ట్స్ వేసుకొని రాకూడదని కూడా అంటారు. సమాజానికి నైతిక పోలీసింగ్ అవసరం లేదని వెల్లడించారు.

జనవరి 9 లోపు ఈ విషయానికి సంబంధించిన సవరణపై నిర్ణయాన్ని తమకు తెలియజేయాలని సుప్రీం కోర్టు కేంద్రానికి ఆదేశించింది. మరి దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.. చూడాలి!