ఆధార్ పై సుప్రీం తీర్పు

భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంఖ్య(ఆధార్‌) రాజ్యంగ బద్ధమైనదేనంటూ సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పు వెల్లడించింది. అయితే ఈ ఆధార్‌పై కొన్ని షరతులువర్తిస్తాయని..ప్రైవేటు వ్యక్తులు లేదా కంపెనీలు ఆధార్‌ కోరడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పును ప్రతిపక్ష కాంగ్రెస్‌ స్వాగతించింది. ఆధార్‌ తీర్పు బీజీపీకి చెంపపెట్టు అని విమర్శించింది.

‘ఆధార్‌ చట్టంలోని సెక్షన్‌ 57ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మేం స్వాగతిస్తున్నాం. ఇక ప్రైవేటు సంస్థలు ధ్రువీకరణ ప్రక్రియ కోసం ఆధార్‌ డేటా తీసుకోడానికి వీలులేదు’ అని కాంగ్రెస్‌ తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో పేర్కొంది. తీర్పుపై కాంగ్రెస్‌ జాతీయ అధికార ప్రతినిధి అభిషేక్‌ మను సింఘ్వీ స్పందిస్తూ.. ‘ఈ తీర్పు బీజీపీకి చెంపపెట్టు. ఆధార్‌ చట్టంలోని సెక్షన్‌ 57ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ప్రైవేటు వ్యక్తులు ఆధార్ డేటా తీసుకోవడం రాజ్యాంగబద్ధం కాదని కోర్టు తెలిపింది’ అని ట్వీట్‌ చేశారు.

అటు తృణమూల్‌ పార్టీ కూడా ఈ తీర్పును స్వాగతించింది. ‘ఆధార్‌ చట్టంలోని సెక్షన్‌ 57ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇకపై బ్యాంకులు, స్కూళ్లు, మొబైల్‌ కంపెనీలకు ఆధార్‌ డేటాను ఇవ్వాల్సిన అవసరం లేదు. దీనికోసం టీఎంసి పార్టీ ఎంతగానో పోరాడింది’ అని టీఎంసి ట్వీట్ చేసింది.

ప్రతి చిన్న పనికీ ఆధార్‌ కోరుతుండటంతో ఈ మధ్య చర్చంతా దీనిపైనే నడుస్తోంది. సర్కారు సేవలన్నింటికీ ఆధార్‌ తప్పనిసరి అని చెప్తుంటే.. కొందరు మాత్రం దీని వల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతోందని అంటుండడంతో వివాదం నెలకొంది. ఆధార్‌ ఎక్కడ అవసరం, ఎక్కడ అవసరం లేదనే దానిపై సందిగ్ధత నెలకొంది. కాగా నేడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో స్పష్టత వచ్చింది.

భారత పౌరులకు జాతీయ గుర్తింపు కార్డు అయిన ఆధార్‌ గురించి నేడు సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఆధార్‌ రాజ్యాంగ బద్ధమే అని స్పష్టం చేసింది. అయితే కొన్ని షరతులను కూడా విధించింది. ఆధార్‌ సమాచారాన్ని ప్రైవేటు సంస్థలకు ఇవ్వడానికి వీల్లేదని ఆదేశించింది. అలాగే వీలైనంత తొందరగా సమాచార సంరక్షణకు చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వానికి తెలిపింది. అలాగే అక్రమ వలసదారులు ఆధార్‌ పొందకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. తాజా తీర్పు నేపథ్యంలో ఆధార్‌ ఎక్కడెక్కడ అవసరమో, ఎక్కడ అవసరం లేదో తెలుసుకుందాం.
,
ఆధార్‌ దేనికి అవసరం: పాన్‌ కార్డు దరఖాస్తు చేసుకునేందుకు, ఆదాయపన్ను రిటర్నులు ఫైల్‌ చేయడానికి, ప్రభుత్వ సబ్సిడీలు, సంక్షేమ పథకాల లబ్ధి పొందేందుకు ఆధార్ అవసరమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

ఆధార్‌ దేనికి అవసరం లేదు: బ్యాంకు ఖాతాలకు, టెలికాం సేవలకు, మొబైల్‌ నంబరుతో అనుసంధానానికి, సీబీఎస్‌ఈ, నీట్‌, యూజీసీ పరీక్షలకు, స్కూల్‌ అడ్మిషన్లకు ఆధార్ అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.