HomeTelugu Reviews'సూర్యకాంతం' మూవీ రివ్యూ

‘సూర్యకాంతం’ మూవీ రివ్యూ

6 27మెగా వారసురాలు నిహారిక ‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్‌ గా పరిచయం అయ్యారు. ఒకవైపు వెబ్‌ సిరీస్‌లతో అలరిస్తూనే వెండితెరపై నటిగా గుర్తింపు పొందాలని ఆమె ప్రయత్నిస్తున్నారు. గత ఏడాది ఆమె హీరోయిన్‌గా వచ్చిన ‘హ్యాపీ వెడ్డింగ్‌’ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అయితే ‘సూర్యకాంతం’ సినిమాతో హిట్‌ వస్తుందని నిహారిక అభిప్రాయపడ్డారు. మరి శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది?ఆకట్టుకుందా?

కథ: సూర్యకాంతం (నిహారిక‌) గ‌డుస‌మ్మాయి. బంధాల‌నే కాదు.. బ‌య‌ట కూడా ఎవర్నీ తొంద‌రగా న‌మ్మేర‌కం కాదు. అలా మార‌డానికి కుటుంబంలో ప‌రిస్థితులే కార‌ణం. అలాంటి అమ్మాయి జీవితంలోకి అభి (రాహుల్ విజ‌య్‌) వ‌స్తాడు. సూర్యకాంతం గ‌డుసు త‌నాన్ని చూసి మ‌న‌సు పారేసుకంటాడు. క్రమంగా ఇద్దరూ ద‌గ్గరవుతారు. అభి త‌న మ‌న‌సులో ఉన్న ప్రేమ‌ని బ‌య‌ట పెట్టాల‌నుకునేలోపే సూర్యకాంతం ఇంటి నుంచి మాయ‌మైపోతుంది. ఏడాదిపాటు ఎదురు చూసినా తిరిగి రాదు. దాంతో ఇంట్లో పెద్దలు కుదిర్చిన పూజ (పెర్లిన్‌)తో పెళ్లికి ఒప్పుకొంటాడు. కొన్ని రోజుల్లో నిశ్చితార్థం అన‌గా సూర్యకాంతం ప్రత్యక్షం అవుతుంది. ఈసారి ఆమే ప్రేమిస్తున్నట్లు అభితో చెబుతుంది. మ‌రి అటు పూజ‌.. ఇటు సూర్యకాంతం మ‌ధ్య అభి ఎలా న‌లిగిపోయాడు? ఇంత‌కీ సూర్యకాంతం ఏడాదిపాటు ఇంట్లో నుంచి వెళ్లిపోవ‌డానికి కార‌ణ‌మేమిటి? ఆ ఇద్దరిలో ఎవ‌రు అభితో క‌లిసి జీవితాన్ని పంచుకున్నారు? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పైనే చూడాలి.

6a 3

నటీనటులు : అభి, సూర్యకాంతం, పూజ‌.. ఈ మూడు పాత్రల్నీ ద‌ర్శకుడు తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది. దాంతో రాహుల్ విజ‌య్‌, నిహారిక‌, పెర్లిన్‌ల‌కి చక్కటి న‌ట‌న ప్రదర్శించే అవకాశం ల‌భించింది. పూజ పాత్రలో చాలా స్పష్టత కనిపిస్తుంటుంది. ఇద్దర‌మ్మాయిల మ‌ధ్య న‌లిగిపోతూ భావోద్వేగాలు పండించే అభి పాత్రతో రాహుల్ మెప్పిస్తాడు. నిహారిక తొలి భాగంలో కొంటెపిల్లగా క‌నిపించిన విధానం.. ద్వితీయార్థంలో మ‌న‌సులోని ప్రేమ‌ని బ‌య‌ట పెట్టేందుకు ప్రయ‌త్నించిన తీరు ఆక‌ట్టుకుంటుంది. సూర్యకాంతం త‌ల్లిగా ఆ పాత్ర ప‌రిధి మేర‌కు సుహాసిని చక్కగా న‌టించారు. హీరో త‌ల్లిదండ్రులుగా శివాజీరాజా, మ‌ధుమ‌ణి క‌నిపిస్తారు. స‌త్య అక్కడక్కడా న‌వ్వించారు. మిగిలిన పాత్రల‌కి అంత‌గా ప్రాధాన్యం లేదు. సాంకేతికంగా సినిమా బాగుంది. మార్క్ కె రాబిన్ మంచి పాట‌ల‌తో పాటు.. నేప‌థ్య సంగీతం అందించారు. హ‌రి జాస్తి కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తుంది. వెబ్ సిరీస్ తీసి పేరు తెచ్చుకున్న ద‌ర్శకుడు ప్రణీత్ సినిమాని కూడా అదే త‌ర‌హాలో తీశారు. చాలా చోట్ల స‌న్నివేశాలు నిదానంగా సాగుతాయి. సినిమా స్థాయి వేగం కొన్నిచోట్ల మాత్రమే క‌నిపించింది. నిర్వాణ సినిమాస్ నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

విశ్లేషణ : కలిసుండ‌డ‌మే కాదు.. అవ‌స‌ర‌మైన‌ప్పుడు విడిపోవ‌డం కూడా ప్రేమే అని చెప్పిన క‌థ ఇది. ఇద్దరమ్మాయిలు, ఒక అబ్బాయి మ‌ధ్య ముక్కోణ‌పు ప్రేమ‌క‌థ‌గా సాగుతుంది. కొత్త క‌థ కానప్పటికీ.. న‌వ‌త‌రం ఆలోచ‌న‌ల‌కి, వారి జీవ‌న శైలికి అద్దం ప‌డుతూ కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు ద‌ర్శకుడు. ఒక అబ్బాయి జీవితంలో ఇద్దరమ్మాయిలొస్తే? పైగా వాళ్లిద్దరిలో ఏ ఒక్కరినీ దూరం చేసుకోలేని ప‌రిస్థితులు తలెత్తితే ఎలా ఉంటుంద‌నే అంశాలే ఇందులో కీల‌కం. తొలి స‌గ‌భాగం సినిమాలో అక్కడ‌క్కడా సున్నిత‌మైన హాస్యం.. పాత్రల ప‌రిచ‌యానికే ప‌రిమిత‌మైంది త‌ప్ప పెద్దగా క‌థేమీ లేదు. నిహారిక పాత్ర చేసే హంగామా కొన్ని చోట్ల న‌వ్విస్తే, మరి కొన్ని చోట్ల చికాకు తెప్పిస్తుంది. ఆ పాత్ర డిజైన్ చేసిన విధాన‌మే అలా ఉంది. విరామం స‌న్నివేశాలు మాత్రం ఆస‌క్తిని రేకెత్తిస్తాయి. అక్కడ్నుంచే అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. మూడు పాత్రల మ‌ధ్య సంఘ‌ర్షణని తెర‌పై చూపించిన విధానం బాగుంది. ద్వితీయార్ధంలో కొన్నిచోట్ల సూర్యకాంతం పాత్ర వ్యతిరేక ఛాయ‌ల‌తో సాగుతుంది. కానీ ఆమె ఇంటి నుంచి ఎందుకు వెళ్లిపోయింది? ఎందుక‌లా వ్యవ‌హ‌రించిందనడానికి కార‌ణాల్ని మాత్రం బ‌లంగా చెప్పలేక‌పోయాడు ద‌ర్శకుడు. సూర్యకాంతం పాత్రకి ఉన్న కమిట్‌మెంట్ ఫోబియా గురించి బ‌లంగా చెప్పుంటే ఈ సినిమా క‌థ ప‌రిపూర్ణంగా అనిపించేదేమో. ప‌తాక స‌న్నివేశాల్ని కూడా కొత్తగా చూపించే ప్రయ‌త్నం చేశాడు ద‌ర్శకుడు. సూర్యకాంతం త‌ల్లి అభితో చెప్పిన మాట‌ల‌కి లింక్ చేస్తూ ద‌ర్శకుడు క‌థ‌ని ముగించిన విధానం బాగుంది.

6b

టైటిల్ : సూర్యకాంతం
నటీనటులు :నిహారిక కొణిదెల, రాహుల్‌ విజయ్‌, పెర్లిన్‌ బెసానియా, సుహాసిని, శివాజీ రాజా
సంగీతం : మార్క్‌ కె రాబిన్‌
దర్శకత్వం : : ప్రణీత్‌ బ్రహ్మాండపల్లి
నిర్మాత : వై. సందీప్‌, వై. సృజన, రామ్‌ నరేష్‌

ప్లస్‌ పాయింట్స్‌ :
హీరో, హీరోయిన్‌ పాత్రలు

మైనస్‌ పాయింట్స్‌ :
నిదానంగా సాగే స‌న్నివేశాలు

చివరిగా : మెప్పించేలా ఉన్న ‘సూర్యకాంతం’
(గమనిక :ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Recent Articles English

Gallery

Recent Articles Telugu

మెగా వారసురాలు నిహారిక 'ఒక మనసు' సినిమాతో హీరోయిన్‌ గా పరిచయం అయ్యారు. ఒకవైపు వెబ్‌ సిరీస్‌లతో అలరిస్తూనే వెండితెరపై నటిగా గుర్తింపు పొందాలని ఆమె ప్రయత్నిస్తున్నారు. గత ఏడాది ఆమె హీరోయిన్‌గా వచ్చిన 'హ్యాపీ వెడ్డింగ్‌' సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అయితే 'సూర్యకాంతం' సినిమాతో హిట్‌ వస్తుందని నిహారిక అభిప్రాయపడ్డారు. మరి శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన...'సూర్యకాంతం' మూవీ రివ్యూ