నేను ధరించిన అత్యంత ఖరీదైన దుస్తులు ఇవే: తమన్నా

మిల్కీ బ్యూటీ తమన్నా.. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో తాను ధరించిన దుస్తులు అత్యంత ఖరీదైనవని అంటున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా యువరాణిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో తమన్నా ధరించే దుస్తులను చిరు కుమార్తె సుస్మిత, డిజైనర్‌ అంజు మోడీ కలిసి రూపొందించారని ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా వెల్లడించారు. ‘ఈ సినిమాలో నేను భారీ లెహెంగాలు ధరించాను. వీటిని సుస్మిత, అంజు మోడీ కలిసి డిజైన్‌ చేశారు. ఇప్పటివరకు నేను ధరించిన అత్యంత ఖరీదైన దుస్తులు ఇవే. ‘బాహుబలి’ సినిమా తర్వాత నేను నటిస్తున్న అతి భారీ చిత్రం ‘సైరా’. సినిమా తప్పకుండా అందరినీ సర్‌ప్రైజ్‌ చేస్తుంది’ అని తెలిపారు.

అనంతరం తన బాలీవుడ్‌ సినిమాల గురించి మాట్లాడుతూ.. ‘నాకు బాలీవుడ్‌లో కేవలం రెండే రెండు రకాల సినిమాలు చేయాలనుంది. ఒకటి బయోపిక్‌. మరొకటి పూర్తిగా డ్యాన్స్‌ నేపథ్యంలో తెరకెక్కే సినిమా. ఇక బయోపిక్‌ విషయానికొస్తే నేను చిన్నప్పటి నుంచి శ్రీదేవి అభిమానిని. ఆమెను చూశాకే సినిమాల్లోకి రావాలన్న ఆసక్తి కలిగింది. నాకు శ్రీదేవి బయోపిక్‌లో నటించాలని ఉంది’ అన్నారు తమన్నా.