మరోసారి ఆ పాత్ర చేయలేను: తాప్సీ


హిందీలో బ్లాక్‌ బస్టర్‌ విజయం అందుకున్న “పింక్‌” చిత్రాన్ని తమిళంలో ‘నేర్కొండ పార్వాయ్‌’ పేరుతో తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నటుడు అజిత్‌ ప్రధాన పాత్రలో రూపొందుతోంది. పింక్‌ సినిమాలో తాప్సి నటించిన కీలక పాత్రను తమిళంలో శ్రద్ధా శ్రీనాథ్‌ పోషిస్తోంది. అయితే తమిళ సినిమాలోను ఆ పాత్రలో తనను నటించాలని కోరినా ఒప్పుకొనేదాన్ని కాదని తాప్సి అంటున్నారు. ఈ విషయం గురించి ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. తనకు నేర్కొండ పార్వాయ్ చిత్రంలో అవకాశం రాలేదని.. ఒకవేళ అవకాశం వచ్చినా నటించేందుకు ఒప్పుకొనేదాన్ని కాదని అంటోంది.

ఎందుకంటే పింకీ చిత్రంలో తాను చేసిన ఆ పాత్ర చాలా భావోద్వేగంతో కూడినదని.. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న అమ్మాయి పడే బాధను ఆ పాత్రలో చూడొచ్చని తెలిపింది. పింక్‌ సినిమాలో ఆ పాత్రలో నటిస్తున్నప్పుడు తాను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయినట్లు తాప్సీ తెలిపింది. మళ్లీ అదే పాత్రలో నేర్కొండ పార్వాయ్‌ సినిమాలో నటించే ధైర్యం తనకు లేదని స్పష్టం చేసింది. ఆ బాధను భరించలేను. మున్ముందు అజిత్‌ సినిమాలో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను. కానీ ఈ సినిమాలో మాత్రం నటించలేనని వెల్లడించింది. వినోద్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పార్వాయ్‌ సినిమాకు బోనీ కపూర్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆగస్ట్‌ 10న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.