వర్మా దమ్ముంటే .. ఆ హత్యపై సినిమా తీయాండి: దివ్యవాణి

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నప్పటికీ వైసీపీ అధ్యక్షుడు జగన్‌ వాటిపై ఏమాత్రం దృష్టిపెట్టకుండా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మకు మద్దతివ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ నాయకురాలు, సినీనటి దివ్యవాణి అన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో మీడియాతో ఆమె మాట్లాడారు. ఏపీలో ఫొని తుపాను, నీటి సమస్యలు.. తెలంగాణలో ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించకుండా వర్మకు మద్దతుగా ట్విటర్‌లో జగన్‌ పేర్కొన్న వ్యాఖ్యలు గర్హనీయమన్నారు. రాంగోపాల్‌ వర్మకు దమ్ముంటే వైఎస్‌ కుటుంబంలో జరిగిన హత్యపై సినిమా తీయాలని సవాల్‌ విసిరారు. జగన్, విజయసాయి రెడ్డి చేతుల్లో వర్మ కీలుబొమ్మ అని దివ్యవాణి ఆరోపించారు. వర్మ తన సామాజిక మాధ్యమాల ద్వారా టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుకు క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు.