చంద్రబాబు పాలనపై టీడీపీ నేతల విమర్శలు


ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి టీడీపీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో చంద్రబాబు టీడీపీ ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు వెల్లడించాలని కోరారు. ఈ సందర్భంగా గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో జరిగిన తప్పులను ఎత్తి చూపారు. ఓటమికి అవే కారణాలంటూ నినదించారు. విజయవాడలో జరిగిన టీడీపీ అంతర్గత సమావేశంలో కొందరు నిర్మొహమాటంగా తమ భావాలను ఈ సమావేశంలో వ్యక్తపరిచారు. వేలాది మందితో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ చేయడాన్ని కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు తప్పుపట్టారు. ఈ కాన్ఫరెన్స్‌ల వల్ల వాస్తవాలు చెప్పే అవకాశం లేకుండా పోయిందన్నారు. టీడీపీలో మానవ సంబంధాలు తగ్గిపోయాయని జూపూడి ప్రభాకర్‌ అభిప్రాయపడ్డారు. కార్యకర్తలు, నేతలకు చంద్రబాబు దూరమయ్యారని.. పార్టీ నిర్లక్ష్యానికి గురవుతున్న విషయాన్ని పెద్దలు గుర్తించలేదని తెలిపారు. ఆర్టీజీఎస్‌ నివేదికలే కొంప ముంచాయని ఎమ్మెల్సీ శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు. గతంలో, ఇప్పుడు అధికారులను పక్కన పెట్టుకోవడం వల్లే కొంప మునిగిందన్నారు.

కోడెల శివప్రసాదరావు కుటుంబ అక్రమాలపై ఎన్నికల వేళ ప్రజలు ప్రస్తావించారని, గ్రామాల్లో నేతల అవినీతిపై అధినేతకు చెప్పే అవకాశమే లేకుండా చేశారని దివ్యవాణి ఆరోపించారు. చంద్రబాబు చుట్టూ చేరిన బృందం అధినేతకు వాస్తవాలు తెలియకుండా చేశారని ఆమె తెలిపారు. విభేదాలు వీడి కలిసి ముందుకు సాగుతామని అనంత జిల్లా నేతలు అన్నారు. ఇప్పుడు కలిసి లేకపోతే మరింత నష్టం జరుగుతుందని వారు అభిప్రాయపడ్డారు. పార్టీలో న్యాయ విభాగం పటిష్ట పరచాలని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర సూచించారు. వైసీపీ తమపై పెడుతున్న కేసులపై చర్చకు లీగల్‌ సెల్‌ ఏర్పాటు చేయాలని కోరారు. అనంతపురంలో వైసీపీ అక్రమాలు మొదలయ్యాయని జేసీ పవన్‌ అన్నారు. సిమెంట్‌ కంపెనీ యాజమాన్యాలను డబ్బుల కోసం బెదిరిస్తున్నారని ఆయన ఈ సమావేశంలో ఆరోపించారు.