ఎండలో నగ్నంగా నిలబెట్టించిన టీచర్లు

చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం నానాసాహెబ్‌ పేటలోని చైతన్య భారతి ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌లో హోంవర్క్‌ చేయలేదని, పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని విద్యార్థులను నగ్నంగా ఎండలో నిలబెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. స్కూల్‌లో చదువుకుంటున్న 10 సంవత్సరాల వయసు కలిగిన ఆరుగురు విద్యార్థులను బుధవారం నగ్నంగా ఎండలో నిలుచోవాలని యాజమాన్యం శిక్షించింది. దీనిపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పాఠశాల కరస్పాండెంట్‌ నాగరాజ నాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఆ పాఠశాల గుర్తింపును అధికారులు రద్దు చేశారు. డీఈవో, ఆర్‌జేడీ ఆదేశాలతో పాఠశాల గుర్తింపును రద్దు చేసినట్లు ఎంఈవో లీలారాణి తెలిపారు. ఈ ఘటనపై విద్యార్థుల నుంచి వివరాలు సేకరించామని, దీనిపై జిల్లా విద్యాశాఖాధికారికి నివేదికను అందజేస్తామని ఎంఈవో తెలిపారు.