Homeతెలుగు Newsగెలుపు మాదంటే..మాది అంటున్న టీఆర్‌ఎస్‌, ప్రజాకూటమి

గెలుపు మాదంటే..మాది అంటున్న టీఆర్‌ఎస్‌, ప్రజాకూటమి

13 6తెలంగాణలో ఓట్లు లెక్కింపునకు మరికొద్ది గంటలే ఉండటంతో ప్రధాన పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. టీఆర్‌ఎస్‌, ప్రజాకూటమి నేతలు ఎవరికి వారు తమదే విజయమంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్‌ శాతం పెరగడం తమకే అనుకూలమని భావిస్తూ.. నియోజకవర్గాల వారీగా అంచనాలు వేసుకోవడంలో నిమగ్నమయ్యాయి. సంక్షేమ పథకాలు అమలు ఫలితంగానే ఓటర్లు భారీగా తరలివచ్చి ఓట్లు వేశారని టీఆర్‌ఎస్‌ భావిస్తుండగా, ప్రభుత్వ వ్యతిరేకత కారణంగానే పోలింగ్‌ శాతం పెరిగిందని.. అది తమకు అనుకూలంగా మారిందని ప్రజాకూటమి నేతలు చెబుతున్నారు.

కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రజాకూటమి, టీఆర్‌ఎస్‌ పార్టీలు నియోజక వర్గాలు, మండలాల వారీగా విశ్లేషించుకుంటున్నాయి. పోలింగ్‌ శాతం పెరగడంతో అనుకూలమైన ఫలితాలు వస్తాయని అటు ప్రజాకూటమి.. ఇటు టీఆర్‌ఎస్‌ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు 2014 కంటే రెండు శాతానికిపైగా పోలింగ్‌ పెరగడంతో ఎవరికి వారు తమకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నాలుగున్నరేళ్లలో చేపట్టిన అనేక సంక్షేమ పథకాలు తమను గెలిపిస్తాయని.. అందుకే పెద్ద ఎత్తున ప్రజలు పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి ఓట్లేశారని టీఆర్‌ఎస్‌ నేతలు అభిప్రాయపడుతున్నారు. నియోజక వర్గాల వారీగా లెక్కలు వేసుకుంటున్న నేతలు.. సామాజిక పింఛన్లు, రైతుబంధు, నిరంతర విద్యుత్తు సరఫరా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ తదితర పథకాలు పార్టీకి లబ్దిచేకూర్చాయని భావిస్తున్నారు. అందుకే గతంకంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ప్రజాకూటమి నేతలు మాత్రం 72.2 శాతానికి మించి పోలింగ్‌ నమోదు కావడం.. తమ అభ్యర్థుల గెలుపునకు దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు. సిట్టింగ్‌ స్థానాల్లో వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజాకూటమి హామీలు తమకు ఓట్లు పడేందుకు కారణమయ్యాయని భావిస్తున్నారు. అందుకే పోలింగ్‌ శాతం పెరిగిందని ప్రజాకూటమిలోని భాగస్వామ్యపక్షాలైన కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, సీపీఐ, తెజస‌లు తమకు అనుకూలంగా ఫలితాలు ఉంటాయని విశ్లేషించుకుంటున్నాయి. ఏదేమైనా ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu