HomeTelugu Newsగవర్నర్ నరసింహన్ బదిలీ

గవర్నర్ నరసింహన్ బదిలీ

2ఉమ్మడి ఏపీ గవర్నర్‌గా, రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ గవర్నర్‌గా పనిచేసిన.. తెలంగాణ గవర్నర్ నరసింహన్ బదిలీ అయ్యారు. ఆయన బదిలీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉంది. గత కొంతకాలంగా తెలంగాణ గవర్నర్ బదిలీ విషయంలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటన్నింటికీ చెక్‌పెడుతూ కేంద్రం ఎట్టకేలకు ఆయన బదిలీపై నిర్ణయం తీసుకుంది. నరసింహన్ స్థానంలో తమిళనాడుకే చెందిన మరొకరిని తెలంగాణ గవర్నర్‌గా నియమిస్తారని సమాచారం.

తెలంగాణ రాష్ట్ర తొలి గవర్నర్‌గా, తెలుగు రాష్ర్టాల ఉమ్మడి గవర్నర్‌గా పనిచేసిన రికార్డు నరసింహన్‌కు దక్కుతుంది. దీంతోపాటు రాష్ట్రంలో సుదీర్ఘకాలం పనిచేసిన గవర్నర్‌గా కూడా ఆయన గుర్తింపు పొందారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో 2009 డిసెంబర్ 29న ఆనాడు ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా ఉన్న నరసింహన్‌ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు ఇచ్చి పంపించారు. జనవరి 23, 2010న ఆంధ్రప్రదేశ్‌కు నరసింహన్‌ను పూర్తికాలపు గవర్నర్‌గా నియమించారు. బాధ్యతలు తీసుకున్న తొలిరోజు నుంచి తెలంగాణ ఉద్యమంపై పూర్తి అవగాహనతో నరసింహన్ వ్యవహరించారు. 2014లో రాష్ట్ర విభజన నేపథ్యంలో అత్యంత కీలక పాత్ర నిర్వర్తించారు. రెండు తెలుగు రాష్ర్టాల మధ్య ఆస్తుల పంపిణీ మొదలు అనేక సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఇరురాష్ర్టాల మధ్య సమస్యలను, వివాదాలను పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని కోరడంతోపాటు ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఉమ్మడి సమావేశాలను గవర్నర్ ఏర్పాటుచేశారు. చంద్రబాబు హయాంలో పరిష్కారంకాని సమస్యలను ఆ తర్వాత వచ్చిన వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో చర్చించి సామరస్యంగా పరిష్కారం అయ్యేలా కృషి చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu