తెలుగు రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్‌లో మొండిచేయి

కేంద్ర బడ్జెట్‌ తెలుగు రాష్ట్రాలకు నిరాశే మిగిల్చింది. ఇరు రాష్ట్రాలకు అంతంత మాత్రంగానే కేటాయింపులు చేసింది. ఈ రోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో.. ఆంధ్రప్రదేశ్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రూ.13 కోట్లు, గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.8 కోట్లు కేటాయించారు. ఐఐటీ తిరుపతికి నిధులు కేటాయించలేదు. మరోవైపు తెలంగాణలోని హైదరాబాద్‌ ఐఐటీకి మాత్రమే ఈఏపీ కింద రూ.80 కోట్లు కేటాయించారు. తెలుగు రాష్ట్రాల్లోని ఐఐఎం, ఎన్‌ఐటీ, ఐఐఎస్‌ఆర్‌, ట్రిపుల్‌ ఐటీలకు అవసరమైన నిధులను కేటాయింపుల్లో ఎక్కడా పేర్కొనలేదు. విభజన చట్టంలోని హామీల అమలుపైనా కేంద్రం ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రెవెన్యూ లోటు అంశాలపై ఎక్కడా చోటుదక్కలేదు.

కేంద్ర బడ్జెట్లో పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు రూపాయి సెస్ పెంచడంతో సామాన్యుడిపై భారం వేసింది కేంద్రం. సుంకాల పెంపు నేపథ్యంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు త్వరలో పెరగనున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం రూపాయితో పాటు, మౌలిక సదుపాయాల సెస్‌ కింద మరో రూపాయి చొప్పున విధిస్తున్నట్లు బడ్జెట్లో తెలిపారు. దీంతో ఈ సుంకాల వల్ల రూ.28వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరనున్నాయి. తాజా సుంకాలకు వ్యాట్‌ను అదనంగా జోడించినప్పుడు లీటరు పెట్రోలు రూ. 75, డీజిల్‌ 71 వరకు చేరనున్నాయి.

బంగారంపై కస్టమ్స్‌ సుంకం పెంచడంతో దేశీయ మార్కెట్లో పసిడి ధర అమాంతం పెరిగింది. ఇప్పటికే రూ. 34 వేల పైన ఉన్న పుత్తడి ధర.. శుక్రవారం ఒక్కరోజే రూ. 590 పెరిగింది. దీంతో బులియన్‌ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర రూ. 34,800కు చేరింది. అటు వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. రూ. 80 తగ్గడంతో కేజీ వెండి ధర రూ. 38,500గా ఉంది.