ఫారిన్‌ నుంచి వచ్చాడా.. అమ్మో!

రోజులు మారాయి.. పరిస్థితులు మారాయి.. కరోనా కాలం వచ్చేసింది. ఇదివరకు ఫారిన్‌ నుంచి వచ్చిన వాడిని మనవాళ్లు పెద్ద సెలబ్రిటిలా చూసేవాళ్లు.. వాళ్లు కూడా మేము విదేశాల నుండి వచ్చాము అని గర్వంగా చెప్పుకునేవారు. తమ వాళ్లు కూడా మా అబ్బాయి ఫారిన్‌ వెళ్లాడు అని లేదా మా బంధువు, ప్రెండ్‌ ఫారిన్‌లో ఉన్నాడు అని చెప్పేవారు. ఫారిన్‌ నుంచి వచ్చాడంటే వచ్చే వారిని బంధువులు, ఆత్మీయులు, ప్రెండ్స్ చుట్టూ మూగేసేవారు. తమకోసం ఏం తెచ్చారా అని ఎంతో ఆతృతగా ఎదురు చూసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారిపోయింది. విదేశాల నుంచి మా దేశం రావద్దు కరోనా తేవద్దు అంటున్నారు.

ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎయిర్‌ పోర్టులు సైతం క్లోజ్‌ చేసేశారు. వారిని పలకరించడానికి కూడా ఎవరూ రావడం లేదు. వారిని చూసి ఆమడ దూరం పరుగెడుతున్నారు. ఇంకా చెప్పాలంటే వాళ్ల పరిస్థితి ఎంతకు దిగజారిపోయిందంటే వారు విదేశాల నుంచి వచ్చినట్టు చెప్పుకోవడానికే భయపడిపోతున్నారు. ఎక్కడ వారిని నిర్బంధించేస్తారో అని. కానీ ఏం చేస్తాం.. కరోనా వైరస్‌ వ్యాప్తిచెందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషికి మనవంతు ప్రయత్నం చేయాలి కదా. ఈ కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ.. మన కుటుంబం, మన రాష్ట్రం మన దేశాన్ని కాపాడుకుందాం.