ఊర్వశి సాంగ్‌ రిమిక్స్‌

1994లో వచ్చిన ప్రేమికుడు చిత్రంలోని ‘ఊర్వశి ఊర్వశి టేక్‌ ఇట్‌ ఈజీ ఊర్వశి’… పాటకు ఇప్పటికీ ఎంతో క్రేజ్‌ ఉంది తెలిసిందే. అందుకే ఈ పాటను హిందీలోనూ రీమేక్‌ చేయాలని అనుకున్నారు. ప్రముఖ నిర్మాత భూషణ్‌ కుమార్‌ ఈ పాటను నిర్మించారు. డైరెక్టర్‌ గిఫ్టీ ఈ పాటకు దర్శకత్వం వహించారు. ‘ఊర్వశి..టేక్‌ ఇట్‌ ఈజీ ఊర్వశి’ పాట రీమిక్స్‌ వెర్షన్‌ను ఈరోజు విడుదల చేసింది.

ప్రముఖ గాయకుడు యోయో హనీ సింగ్‌ ఈ పాటను కంపోజ్‌ చేసి పాడారు. పాటలో మిగతా లిరిక్స్‌ అన్నీ మార్చి కేవలం ‘ఊర్వశి టేక్‌ ఇట్‌ ఈజీ ఊర్వశి’ అనే లిరిక్‌ను మాత్రమే వాడారు. పాటలో కైరా అద్వానీ చాలా అందంగా కనిపించారు. షాహిద్‌ కపూర్‌ తన డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు. ఓ నైట్‌ క్లబ్‌లో ఈ పాట వీడియోను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో షాహిద్‌..కియారాను ఇంప్రెస్‌ చేయడానికి ఆమె ముందు డ్యాన్స్‌ చేస్తుంటాడు. షాహిద్‌పై మనసు పారేసుకున్న కైరా అతనితో కలిసి డ్యాన్స్‌ చేస్తుంది. వారిద్దరూ నైట్‌ క్లబ్‌లో డ్యాన్స్‌ చేస్తుండగా బైక్‌పై వచ్చిన కొందరు దొంగలు కైరాకు చెందిన ఖరీదైన లక్జరీ కారును కంటెయినర్‌లోకి ఎక్కిస్తారు. ఆ తర్వాత కియారాకు తెలీకుండా షాహిద్‌ కూడా నిదానంగా అక్కడి నుంచి తప్పుకొంటాడు. కైరా షాహిద్‌ను వెతుక్కుంటూ క్లబ్‌లో నుంచి బయటికి వచ్చి చూడగా షాహిద్‌ తన దొంగల ముఠాతో కలిసి కంటెయినర్‌లోకి ఎక్కి పరారవుతాడు. షాహిద్‌ కపూర్‌ తెలుగులో బ్లాక్‌ బస్టర్‌ విజయం సాధించిన ‘అర్జున్‌ రెడ్డి’ సినిమా రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కైరా అద్వానీ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాకు టైటిల్‌ ఖరారు కాలేదు.