వెంకీ లిస్ట్ లో మూడు ప్రాజెక్ట్స్!

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన ‘గురు’ సినిమా విడుదలై విజయాన్ని అందుకుంది. ఆ తరువాత దాదాపు ఏడు నెలలుగా ఆయన ఖాళీగానే ఉంటున్నారు. తన తోటి హీరోలు సినిమాల విషయంలో దూకుడు చూపిస్తుంటే.. వెంకటేష్ మాత్రం సైలెంట్ అయిపోయాడు. దానికి ఓ కారణముందని చెబుతున్నారు. వెంకీ ఈ ఏడు నెలల్లో చాలా కథలు విన్నట్లు తెలుస్తోంది. వాటిలో మూడు ప్రాజెక్ట్స్ ను ఫైనల్ చేసి వరుస చిత్రాలతో అభిమానులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ముందుగా ఓ కొత్త దర్శకుడితో సినిమాను పట్టాలెక్కించడానికి సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని ఇటీవల ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా ప్రమోషన్స్ లో సురేష్ బాబు వెల్లడించారు.
భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. అలానే పూరిజగన్నాథ్ కూడా ఓ లైన్ వినిపించినట్లు సమాచారం. వెంకటేష్ కు ఆ లైన్ నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసుకొని రమ్మని చెప్పినట్లు తెలుస్తోంది. యాక్షన్ డ్రామా నేపధ్యంలో ఈ సినిమా రూపొందబోతుంది. ఈ సినిమాలో వెంకీ పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనిపించబోతున్నాడని సమాచారం. ఈ రెండు సినిమాలతో పాటు మరో రీమేక్ సినిమా కూడా లైన్ లో పెట్టాడట వెంకీ. తమిళంలో ఘన విజయాన్ని అందుకున్న ‘విక్రమ్ వేద’ అనే సినిమాను తెలుగులో రానాతో కలిసి రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు వెంకటేష్. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ఈ మూడు ఆసక్తికర సినిమాలతో వెంకీ తన అభిమానులను అలరించడానికి సిద్ధమవుతున్నాడని అతడి సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.