‘ఎన్‌‌.టి.ఆర్‌’కి మేనేజర్‌గా వెన్నెల కిశోర్‌!

హాస్యనటుడు వెన్నెల కిశోర్‌ తన చక్కటి నటన, కామెడీతో ప్రేక్షకుల్ని మెప్పించాడు. ఈసారి సీరియస్‌ పాత్రలో కనిపించబోతున్నారు. అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘ఎన్‌‌.టి.ఆర్‌’ లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారట. మొదటి భాగం ‘కథానాయకుడు’ లో వెన్నెల కిశోర్‌ పాత్ర కనిపిస్తుందని సమాచారం. ఎన్టీఆర్‌ పాత్ర పోషిస్తున్న బాలకృష్ణ మేనేజర్‌ రుక్మనంద రావుగా ఆయన‌ నటిస్తున్నట్లు తెలిసింది. రుక్మనంద రావు కేవలం ఎన్టీఆర్‌ మేనేజరే కాదు.. ఆయన సతీమణి బసవతారకం సోదరుడు కూడా. బాలకృష్ణ, వెన్నెల కిశోర్‌కు మధ్య చాలా ముఖ్యమైన సన్నివేశాలు ఉన్నాయట.

ఈ ‘ఎన్‌.టి.ఆర్‌’ సినిమాకి క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వి.ఎస్‌ జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎమ్‌.ఎమ్‌ కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.
ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకం పాత్రలో విద్యా బాలన్‌, నారా చంద్రబాబు నాయుడు పాత్రలో రానా, హరికృష్ణ పాత్రలో కల్యాణ్‌రామ్, అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో సుమంత్‌, జయప్రదగా హన్సిక, జయసుధగా పాయల్‌ రాజ్‌పుత్‌ కనిపించనున్నారు.