‘అల్లాదిన్‌’ లో జీనీగా వెంకటేష్‌, అల్లాదిన్‌ గా వరుణ్‌తేజ్‌

ఒకప్పుడు చిన్నారులను విశేషంగా అలరించిన కార్టూన్‌ సీరియల్‌ ‘అల్లాదిన్‌’. ముఖ్యంగా అల్లాదిన్‌ చేసే సాహసాలు, జీనీ మాయలు, మంత్రాలు చూసి పిల్లలు తెగ సంబర పడిపోయేవారు. ఇప్పుడు మరోసారి వెండితెరపై అల్లాదిన్‌ మెరవనున్నాడు. గాయ్‌ రిట్చయ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అమెరికన్‌ మ్యూజికల్‌ రొమాంటిక్‌ ఫాంటసీ అడ్వెంచర్‌ ఫిల్మ్‌ ‘అల్లాదిన్‌’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తెలుగు టీజర్‌ను విడుదల చేశారు.

ఇందులో జీనీగా ప్రముఖ హాలీవుడ్‌ నటుడు విల్‌స్మిత్‌ కనిపించనున్నాడు. ఇక అల్లాదిన్‌గా మేనా మసూద్‌ నటిస్తుండగా, ప్రిన్స్‌ జాస్మిన్‌గా నయోమి స్కాట్‌ అలరించనుంది. అయితే, జీనికి టాలీవుడ్‌ స్టార్‌ హీరో వెంకటేష్‌ గొంతు అరువివ్వగా, అల్లాదిన్‌కు వరుణ్‌తేజ్‌ డబ్బింగ్‌ చెప్పారు. ‘ఎఫ్‌2’ లో అలరించిన వీరిద్దరూ జీనీ-అల్లాదిన్‌ వాయిస్‌లతో ఈ సినిమాకు మరింత క్రేజ్‌ తీసుకొస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘అల్లాదిన్‌’ ఈ చిత్రం మే 24, 2019న విడుదలకానుంది.