నాని.. నువ్వు సన్‌రైజర్స్‌ తరఫున ఆడాలి.. రౌడీ ట్వీట్‌

నేచురల్‌ స్టార్‌ నాని.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు తరఫున ఆడాలని అభిప్రాయపడుతున్నారు హీరో విజయ్‌ దేవరకొండ. నాని నటించిన ‘జెర్సీ’ సినిమాను ఉద్దేశిస్తూ విజయ్‌ ట్వీట్‌ చేశారు. ‘జెర్సీ.. సినిమా చూశాక మాట రాలేదు. క్లాప్స్‌ కొట్టాను. లవ్‌ టు యూ నాని. గౌతమ్‌ తిన్ననూరి.. మున్ముందు మీరు చేయబోయే ప్రాజెక్ట్‌ల కోసం నేను ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. నాని.. నువ్వు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు తరఫున ఆడాలి’ అంటూ తనదైన శైలిలో ప్రశంసలు గుప్పించారు. నాని, విజయ్‌ ప్రధాన పాత్రల్లో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.

ఇక ‘జెర్సీ’ విషయానికొస్తే గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాని అర్జున్‌ అనే క్రికెటర్‌ పాత్రలో నటించారు. శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా నటించింది. అనిరుధ్ రవిచందర్‌ సినిమాకు సంగీతం అందించారు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. సినిమా నాని కెరీర్‌లో మైలురాయిలా నిలిచిపోతుందంటూ సినీ ప్రముఖులు, అభిమానులు ప్రశంసలు గుప్పిస్తున్నారు.

‘జెర్సీ’ గురించి దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ట్వీట్‌ చేస్తూ.. ‘జాయ్‌ఫుల్‌.. ‘జెర్సీ’ సినిమాను చాలా బాగా రాశారు. గౌతమ్‌ తిన్ననూరి అందంగా తెరకెక్కించారు. ఈ సినిమాకు పనిచేసినవారంతా ఎంతో గర్వపడుతుంటారు. నాని ‘బాబు’..జస్ట్‌ లవ్యూ అంతే..’ అంటూ ‘జక్కన్న’ సినిమాపై ప్రశంసల జల్లులు కురిపించారు.