ఆసక్తికరంగా ‘నోటా’ ట్రైలర్‌

యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘నోటా’. ఈ చిత్రంలో హీరోయిన్‌గా మెహరీన్‌ నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు (గురువారం) ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్‌ను ప్రముఖ నటుడు సూర్య ట్విటర్‌ వేదికగా విడుదల చేశారు. ‘సిటీలో ఉన్న చెరువులన్నీ నిండిపోయాయి. ఇప్పుడు గేట్లు ఎత్తేస్తే చాలా ప్రాంతాలు మునిగిపోతాయ్‌ సర్‌..’ అంటూ వస్తున్న బ్యాక్‌గ్రౌండ్‌ డైలాగ్‌తో ఈ మూవీ ట్రైలర్ మొదలైంది.

ఈ డైలాగ్‌ వచ్చిన వెంటనే ముఖ్యమంత్రిగా విజయ్‌ స్టైల్‌గా కారు నుంచి దిగిన సీన్‌‌ హైలైట్‌గా నిలిచింది. సినిమాలో ఆకతాయిగా తిరిగే విజయ్‌కు ముఖ్యమంత్రి పదవి అప్పగించాలని నిర్ణయించగా.. ఇందుకు విజయ్‌ సర్‌ నాకు అసలు ఐడియా లేదు, అనుభవం లేదు అనడం..ఇందుకు సత్యరాజ్‌ ప్రతిస్పందనగా.. ఈ వీడియో గేమ్‌లో నేరుగా ఆఖరి లెవల్‌కు వెళ్లి ఆడావా ఎప్పుడైనా? అని ప్రశ్నించడం ఆసక్తికరంగా ఉంది.

సీఎంగా ఉన్న విజయ్‌ గురించి మీడియా వర్గాలు మాట్లాడుతూ..కొత్త సీఎం కొత్త పథకం ఏంటో తెలుసా? మందేద్దాం. చిందేద్దాం. డమ్మీ సీఎం మరీ ఇంత డమ్మీనా? ఇది ముఖ్యమంత్రి పదవా? లేక మ్యూజికల్‌ ఛైర్స్‌ ఆటా? అని కామెంట్లు చేయడం కథపై ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యమంత్రి పదవికి కొత్త అభ్యర్ధిని నియమించడం గురించి నాజర్.. విజయ్‌తో‌ మాట్లాడుతూ..టైం బాగోలేదని స్వామిజీ చెప్పారు అనడం.. ఇందుకు విజయ్‌ ..రాష్ట్ర భవిష్యత్తు మొత్తం ఓ స్వామీజీ చేతుల్లోనా? అని ప్రశ్నించడం హైలైట్‌గా నిలిచింది. గ్రీన్‌ స్టూడియోస్‌ పతాకంపై జ్ఞానవేల్‌రాజా సమర్పిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళంలో అక్టోబర్‌ 4న విడుదల కాబోతోంది.