యాటిట్యూడ్‌ మాత్రం మారదంటున్న విజయ్‌

పెళ్లి చూపులు, అర్జున్‌ రెడ్డి, గీతా గోవిందం సినిమాలతో సూపర్‌ హిట్స్‌ అందుకున్నాడు విజయ్‌ దేవరకొండ. ‘గీతాగోవిందం’ తో వంద కోట్ల క్లబ్‌లోకి చేరుకుని అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇక విజయ్‌ దేవరకొండ టైమ్‌ నడుస్తుంది.. తనను ఎవరూ ఆపలేరు అనుకునే సమయంలో ‘నోటా’ విడుదలైంది. తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్‌ చేసిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు అంతగా రుచించలేదు. కేవలం విజయ్‌ ఉన్నాడన్న ఒక్క కారణంతోనే ఈ సినిమాపై తెలుగునాట హైప్‌ క్రియేట్‌ అయింది. అయితే సినిమా మాత్రం ఇక్కడి ప్రేక్షకులకు ఎక్కలేదు. ‘నోటా’ను విమర్శకులు కూడా ఏకిపారేశారు. ఈ సినిమా ఒకవేళ విజయం సాధిస్తే అది కేవలం విజయ్‌ గొప్పతనమే అవుతుందని రివ్యూలు చెప్పేశాయి. అయినా అంతా తానై భుజాన మోసినా ‘నోటా’ మాత్రం సక్సెస్‌ కాలేకపోయింది.

ఇక దీనిపై విజయ్‌ ట్విటర్‌లో స్పందిస్తూ ఓ పోస్ట​ చేశాడు.’ నా మీద ప్రేమతో సినిమా చూసేవారికి, పక్కవారు ఫెయిల్‌ అయితే ఆనందపడి సెలబ్రేట్‌ చేసుకునే వారికి’.. అంటూ మొదలుపెట్టి.. ‘నోటా’ ను చేసినందుకు గర్వపడుతా. దీని ఫెయిల్యూర్‌కు పూర్తిగా నాదే బాధ్యత. ఈ చిత్రాన్ని ప్రేమించిన ప్రేక్షకుల అందరి ప్రేమను నేను తీసుకున్నాను. అలాగే ఈ సినిమాపై వచ్చిన అసంతృప్తి, విమర్శలను సీరియస్‌గా తీసుకున్నాను. వాటిని పరిశీలించాను. నా వైపు ఉన్న తప్పులను సరిచేసుకున్నాను. కానీ, నా యాటిట్యూడ్‌ మాత్రం మారదు. ఓ విజయమో, అపజయమో ఓ రౌడీని తయారు చేయలేదు పడగొట్టలేదు. ఎప్పుడైతే నీకు ఎదురైన సమస్యను వదిలేస్తావో, చూసి ఆగిపోతావో అప్పుడు నువ్వు మారినట్టు. రౌడీ అంటే కేవలం గెలవడమే కాదు.. విజయం కోసం పోరాడటం.. రౌడీలు అయినందుకు గర్వపడదాం. ఫైట్‌ చేస్తూ ఉందాం. గెలుస్తే గెలుస్తాం లేదా నేర్చుకుంటాం. నా ఫెయిల్యూర్‌ను ఎంజాయ్‌ చేస్తున్న వారికిదే సమయం.. ఇప్పుడే పండగ చేస్కోండి. వెంటనే తిరిగి వస్తా!.’ అంటూ తనలోని యాటిట్యూడ్‌ను చూపించాడు విజయ్‌. టాక్సీవాలా, డియర్‌ కామ్రేడ్‌ సినిమాలతో విజయ్‌ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు.