మురుగ‌దాస్‌కు ఊరట!

త‌మిళనాట స‌ర్కార్ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా డీఎంకే కార్య‌క‌ర్త‌లు స‌ర్కార్ సినిమా క‌టౌట్ల‌ను, ఫ్లెక్సీలను ధ్వంసం చేస్తున్నారు. అన్నా డీఎంకే నేత‌లు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు గురువారం రాత్రి సినిమా ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆయ‌న ఇంటికి వెళ్ళారు. ముర‌గ‌దాస్ ఇంట్లో లేక‌పోయేసరికి వెనుదిరిగారు. విష‌యం తెలుసుకున్న ముర‌గ‌దాస్ ముంద‌స్తు బెయిల్ కోసం మ‌ద్రాస్ హైకోర్టులో పిటీష‌న్ వేశారు. పిటీష‌న్ విచారించిన కోర్టు ఈనెల 27వ తేదీ వ‌ర‌కు మురుగ‌దాస్‌ను అరెస్ట్ చేయొద్ద‌ని చెన్నై పోలీసుల‌కు ఆదేశాలు జారీ చేసింది.

అంత‌కుమునుపు పిటీష‌న్ విచార‌ణ స‌మ‌యంలో.. తాము కేవ‌లం ప్రాథ‌మిక ద‌ర్యాప్తు కోస‌మే ముర‌గ‌దాస్ ఇంటికి వెళ్ళిన‌ట్లు చెన్నై పోలీసులు కోర్టుకు తెలిపారు. మురుగ‌దాస్ త‌ర‌ఫు న్యాయ‌వాదులు త‌మ వాద‌న వినిపిస్తూ.. త‌మ సినిమాకు సెన్సార్ ల‌భించింద‌ని, పైగా పోలీసులు చెబుతున్న అభ్యంత‌రాల ప్ర‌జ‌ల నుంచి రాలేద‌ని తెలిపారు. ఇప్ప‌టికే అభ్యంత‌ర‌క‌ర‌మైన కొన్ని సీన్ల‌ను తొల‌గించిన‌ట్లు కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ కేసును ఈనెల 27కు వాయిదా వేస్తూ… అప్ప‌టి వ‌ర‌కు మురుగ‌దాస్‌ను అరెస్ట్ చేయొద్ద‌ని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.