కాస్త ఓపికపట్టమంటున్న బన్నీ నిర్మాతలు!

స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇంకా సినిమాకు టైటిల్‌ ఏమీ అనుకోలేదు. దాదాపు ఏడాది తర్వాత బన్నీ నటిస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్‌ టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి నేటికి 16 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈరోజు సినిమాకు సంబంధించిన ఏదో ఒక సర్‌ప్రైజ్‌ ఉంటుందని అభిమానులు ఆశపడ్డారు. ఈ నేపథ్యంలో సినిమాను నిర్మిస్తున్న హారిక హాసిని క్రియేషన్స్‌ సంస్థను ట్యాగ్స్‌ చేస్తూ రిక్వెస్ట్‌లు పంపుతున్నారు. ‘ఇంకా ఎన్నిరోజులు ఆగాలి..’ అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సంస్థ వివరణ ఇస్తూ.. ‘మేం ప్రతిఒక్కరి ఫీలింగ్స్‌కు విలువిస్తాం. త్రివిక్రమ్‌-బన్నీ కాంబినేషన్‌ కోసం మీరు ఎంత ఆత్రుతగా ఎదురుచూస్తున్నారో.. మేమూ అంతే ఎగ్జైటింగ్‌గా ఉన్నాం. ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగాకే మీకు పూర్తి వివరాలు ప్రకటించగలుగుతాం. దయచేసి అప్పటివరకు ఓపిక పట్టండి. త్వరలో మరిన్ని అప్‌డేట్స్‌తో మీ ముందుకొస్తాం’ అని వెల్లడించింది.