నిజంగా నువ్వు దేవుడి బిడ్డవు నాన్నా: సౌందర్య రజనీకాంత్‌


సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కుమార్తె సౌందర్య ఈ రోజు జీవితాంతం గుర్తుంటుందని అంటున్నారు. 2011లో చికిత్స కోసం సింగపూర్‌ వెళ్లిన తలైవా సరిగ్గా ఇదే రోజున (శనివారం) తిరిగి చెన్నై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన్ను చూడటానికి జనం గుమిగూడారు. ఈ సమయంలో తీసిన వీడియోను సౌందర్య శనివారం ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ’13-7-2011.. సింగపూర్‌లో చికిత్స పూర్తయిన తర్వాత నాన్న తిరిగి చెన్నైకి వచ్చిన రోజిది. ఎనిమిదేళ్లు గడిచిపోయాయి. నిజంగా నువ్వు దేవుడి బిడ్డవు నాన్నా. మా తండ్రి, మా కుటుంబం కోసం ప్రార్థించిన, ప్రార్థిస్తూనే ఉన్న హృదయాలకు నా ధన్యవాదాలు’ అని ఆమె భావోద్వేగంతో ట్వీట్‌ చేశారు.

రజనీ ఇటీవల ‘పేట’ సినిమాతో విజయం అందుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘దర్బార్‌’ సినిమాలో నటిస్తున్నారు. ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకుడు. నయనతార హీరోయిన్‌. అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.