అవినీతి కారణంగానే చంద్రబాబు భయపడుతున్నారు: జగన్‌

విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గుర్లలో జరిగిన బహిరంగ సభలో వైసీపీ అథినేత వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. ఎన్నికల సమీపిస్తున్నందును ప్రతీ నియోజవర్గానికి రూ. 30 కోట్లు తరలించారని, వాటి వివరాలు బయటపడుతాయనే చంద్రబాబు భయాందోళనకు గురవుతున్నారని జగన్‌ విమర్శించారు. అక్రమంగా సంపాదించిన సొమ్మును ఐటీ అధికారులు ఎక్కడ స్వాధీనం చేసుకుంటారోనని చంద్రబాబునాయుడు భయపడుతున్నారని ఆయన ఆరోపించారు. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను పశువులను కొన్నట్లు కొన్నారని, వాటి వివరాలు ఎక్కడ ఐటీ అధికారులు ప్రశ్నిస్తారో అని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని మండిపడ్డారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రాంలో ఎక్కడ చూసినా అవినీతే.

జిల్లాకు తలమానికంగా ఉన్న తోటపల్లి ప్రాజెక్టును చంద్రబాబు అటకెక్కించారని, వైఎస్సార్‌ హాయాంలో ఈ ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తి అయ్యాయని గుర్తుచేశారు. గడిచిన నాలుగేళ్ల కాలంలో మిగిలిన 10 శాతం పనులను కూడా చంద్రబాబు పూర్తి చేయలేకపోయారని ఆరోపించారురు. గతంలో అనేకసార్లు ఐటీ దాడులు జరిగినా స్పందించని సీఎం ఇప్పుడెందుకు గిలగిల కొట్టుకుంటున్నారు అని జగన్‌ ప్రశ్నించారు. విజయనగరంలో 16 మిల్లులు ఉంటే నాలుగేళ్ల కాలంలో 6 మిల్లులు మూతపడ్డాయని. కేవలం కరెంట్‌ చార్జీలు అధికంగా పెంచడం వల్లనే అవి మూతపడుతున్నాయని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో 18లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉంటే అందులో ఉత్తరాంధ్రలోనే అత్యధికంగా నష్టపోయారని జగన్‌ అన్నారు. వారందరికి నష్టపరిహారం చెల్లించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.