కర్ణాటకలో ‘కాలా’కు తొలగని అడ్డంకులు

ప్రపంచమంతటా ఘనంగా విడుదలైన కాలా సినిమాకు కర్ణాటకలో నిరాశ ఎదురైంది. కన్నడిగుల ఆందోళనతో థియేటర్లలో కాలా చిత్రాన్ని ప్రదర్శించడానికి యజమానులెవరూ ధైర్యం చేయలేకపోయారు. విడుదల రోజు తమ అభిమాన నటుడు రజనీకాంత్ సినిమా చూడలేకపోయామని అక్కడి పలువురు అభిమానులు తమ నిరుత్సాహపడ్డారు. రాష్ట్రంలోని చాలా థియేటర్లలో కాలా సినిమాను ప్రదర్శించలేదు. కొన్ని థియేటర్లలో సినిమాను ప్రదర్శించే ప్రయత్నం చేస్తుంటే ఆందోళనకారులు అడ్డుకుని నిరసనకు దిగారు. సినిమాను బహిష్కరించాలని ఆందోళనకారులు హెచ్చరించారు. దీంతో కర్ణాటకలో సినిమా ప్రదర్శించేందుకు థియేటర్ యాజమాన్యాలు ధైర్యం చేయలేకపోయాయి. మైసూరులో మాత్రం కొన్ని థియేటర్లలో సినిమాను ఆలస్యంగా ప్రదర్శించారు.

బళ్లారి, రాయచూరు జిల్లాల్లో 2 సినిమా థియేటర్లలో కాలా చిత్రాన్ని ప్రదర్శించాలనుకున్నారు. “మేం ప్రతి థియేటర్‌కి వెళ్లి కాలా సినిమాను బహిష్కరించాలని చెప్పాం. మనకు కాలా సినిమా కంటే కావేరీ నదీ జలాల అంశం ముఖ్యమైనదని” వారికి చెప్పామని కర్ణాటక రక్షణ వేదిక్‌(కేఆర్‌వీ) ప్రతినిధి ప్రవీణ్‌ శెట్టి తెలిపారు. కావేరీ నదీ జలాల వివాదంపై రజనీ వ్యాఖ్యలకు నిరసనగా కాలా చిత్రాన్ని నిషేధించాలని కన్నడిగులు డిమాండ్ చేశారు. ఈ విషయం సుప్రీంకోర్టుకు చేరింది. సినిమాపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. కాలా సినిమాను నిషేధించాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతోపాటు కాలా సినిమా థియేటర్ల వద్ద భద్రత ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ కర్ణాటకలోని ఆందోళనలతో రజనీ అభిమానులకు నిరాశ మిగిల్చింది.