2020కి ‘గూఢచారి’..2!


‘గూఢచారి’ సినిమా తో నటుడిగానే కాకుండా మంచి రచయితగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు అడివి శేష్‌. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ రాబోతున్నట్లు చిత్ర వర్గాలు ప్రకటించాయి. అదే త్రినేత్ర 116. ఈరోజు అడివి శేష్‌ పుట్టినరోజు సందర్భంగా సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ పనులు మొదలైనట్లు వెల్లడిస్తూ ఈ చిత్ర కాన్సెప్ట్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. 2019 జూన్‌ నుంచి చిత్రీకరణ మొదలుకానుందట. ఈ చిత్రానికి రాహుల్‌ పాకాల దర్శకత్వం వహించనున్నారు. 2020లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.పోస్టర్‌లో ‘గూఢచారి విల్‌ బీ బ్యాక్‌’ అని రాసుంది. ‘2’ అనే నెంబర్‌లో అడివి శేష్‌ను వెనక నుంచి చూపించారు. ఇందులో శ్యాంగా కీలక పాత్ర పోషించిన వెన్నెల కిశోర్‌ సీక్వెల్‌ గురించి స్పందిస్తూ..’నేను కూడా ఇందులో భాగమైతే బాగుండు’ అని క్యాప్షన్‌ ఇచ్చారు.

ఆగస్ట్‌లో విడుదలైన ‘గూఢచారి’ చిత్రాన్ని శశి కిరణ్‌ టిక్కా తెరకెక్కించారు. అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ నామా నిర్మాతగా వ్యవహరించారు. శోభిత ధూళిపాళ్ల, ప్రకాశ్‌రాజ్‌, వెన్నెల కిశోర్‌, మధు శాలిని, రవిప్రకాశ్‌, సుప్రియ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించినప్పటికీ ఈ చిత్రాన్ని జేమ్స్‌ బాండ్‌ స్థాయినలో తెరకెక్కించి ప్రేక్షకుల మన్ననలు పొందారు.