చిన్నారితో చిన్నారిగా నయన్‌.. క్యూట్‌ వీడియో!

స్టార్ హీరోయిన్‌ నయనతారకు 2018 గుర్తుండిపోయే విజయాలను అందించింది. ఆమె నటించిన కొలమావుకోకిల, ఇమైకా నోడిగల్ హిట్ చిత్రాలు జాబితాలో నిలిచాయి. ఆ రెండు సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించిన ఆమె ఒంటిచేత్తో విజయం అందించగలనని మరోసారి నిరూపించారు. ప్రస్తుతం ఆమె శివకార్తికేయన్‌కు జోడీగా ఓ సినిమాలో నటిస్తున్నారు. దాని షూటింగ్ నిమిత్తం వారు అజర్‌బైజాన్‌లో పర్యటిస్తున్నారు. అయితే షూటింగ్ సమయంలో నయన్ ఓ చిన్నారితో సరదాగా గడిపిన వీడియో ఒకటి ఇప్పుడు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. చాలా చలాకీగా ఉన్న ఆ పాప నయనతారతో హుషారుగా గడిపింది. ఆ చిన్నారి చేష్టలకు నయన్‌ నవ్వూతూనే ఉన్నారు. నెటిజన్లను ఇప్పుడు ఆ వీడియో విపరీతంగా ఆకట్టుకుంటోంది.

కామెడీ, డ్రామా ప్రధానంగా తెరకెక్కుతోన్న ఆ సినిమాకు ఎం రాజేశ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కేఈ జ్ఞాన్‌వేల్ రాజా నిర్మిస్తుండగా, హిప్‌ హాప్‌ ఆది స్వరాలు సమకూరుస్తున్నారు. ఆ చిత్రానికి ఎస్‌కే 13 అని పేరు పెట్టినట్లు సమాచారం. అలాగే అజిత్, నయన్‌ జంటగా నటించిన విశ్వాసం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో సైరా నరసింహారెడ్డి, ఓ మలయాళం చిత్రంలో నటిస్తూ నయనతార బిజీగా ఉన్నారు.