తాత, తండ్రి రూట్‌లో అఖిల్..!


తెలుగు ఇండస్ట్రీలో ప్రతి దర్శకుడు, హీరో కొత్తగా ప్రయత్నించాలని చూస్తున్నారు. ఇప్పుడు అఖిల్ కూడా ఇదే చేయబోతున్నాడు. ఇప్పటివరకు చేసిన మూడు సినిమాలు అనుకున్నంత విజయం సాధించలేకపోవడంతో నాలుగో సినిమా కోసం మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అక్కినేని వారసుడు. ఈసారి ఏకంగా బ్లాక్ బాస్టర్ థీమ్ వెంట పెట్టుకుని వస్తున్నాడు ఈ హీరో. తెలుగు సినిమా పరిశ్రమకు ఎంతగానో కలిసొచ్చిన పునర్జన్మల నేపథ్యంలో అఖిల్ నాలుగో సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. అఖిల్‌ కోసం దర్శకుడు క్రిష్ ప్రత్యేకంగా ఓ కథను సిద్ధం చేశాడట. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

పునర్జన్మల‌ కథలతో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. అఖిల్ తాత అక్కినేని నాగేశ్వరరావు ఆరోజుల్లో నటించిన ‘మూగ మనసులు’ సినిమా పునర్జన్మల‌ నేపథ్యంలోనే తెరకెక్కింది. ఈ చిత్రం అప్ప‌ట్లో సంచలన విజయం సాధించింది. ఆతర్వాత పునర్జన్మల నేపథ్యంలోనేననాగేశ్వరరావు తనయుడు నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘జానకి రాముడు’ సినిమా మరో సంచలన విజయం అయింది. మూగమనసులు సినిమాకు రీమేక్‌లా జానకి రాముడు రూపొందించారు.

ఆ తర్వాత అక్కినేని కుటుంబం మొత్తం కలిసి నటించిన ‘మనం’ సినిమా కూడా పునర్జన్మల నేపథ్యంలోనే తెరకెక్కింది. విక్రమ్ కె.కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చిత్రంగా మిగిలిపోయింది. అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రం కావడంతో ‘మనం’ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక ఇప్పుడు అఖిల్ కూడా పునర్జన్మల నేపథ్యంలో సాగే కథతోనే సినిమా చేస్తుండటంతో అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను క్రిష్ ఎలా తెరకెక్కిస్తాడో చూడాలి అనే ఆసక్తి అంద‌రిలోనూ ఉంది. ఈ సినిమా అఖిల్‌ను మంచి నటుడిగా చేస్తుందని ఆశిద్దాం.