నానాకు షాక్‌.. ‘హౌస్‌ఫుల్‌ 4’ నిలిపివేయాలంటున్న అక్షయ్‌!

#మీటూ..లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్‌ నటుడు నానా పటేకర్‌కు.. అక్షయ్‌ కుమార్ తన నిర్ణయంతో షాకిచ్చాడు ‌. అక్షయ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘హౌస్‌ఫుల్‌ 4’. ఇందులో నానా పటేకర్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. కానీ కొన్ని రోజులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నానాతో కలిసి తాను పనిచేయనని, ఆయన కేసు విచారణ పూర్తయ్యేవరకూ చిత్రీకరణ నిలిపివేయాలని అక్షయ్‌ చిత్రబృందాన్ని కోరారు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు.

‘గురువారం రాత్రి నేను ముంబయి చేరుకున్నాను. రాగానే లైంగిక వేధింపుల గురించి వస్తున్న వార్తలను చదివాను. అవి నన్ను చాలా బాధించాయి. విచారణ పూర్తయ్యేవరకు ‘హౌస్‌ఫుల్‌ 4′ చిత్రీకరణ నిలిపివేయాలని నిర్మాతలను కోరాను. ఎందుకంటే ఇది చూసీచూడనట్లు వదిలేసే విషయం కాదు. తప్పు ఉందని తెలిస్తే కఠిన చర్యలు తీసుకోక తప్పదు. నిందితులతో కలిసి పనిచేసే ఉద్దేశం నాకు లేదు. ఎవరైతే వేధింపులకు గురయ్యామని చెప్తున్నారో వారి వాదనలు విని, వారికి సరైన న్యాయం జరగాలన్నది నా అభిప్రాయం’ అని వెల్లడించారు. తనను పదేళ్ల క్రితం లైంగికంగా వేధించాడంటూ సినీ నటి తనుశ్రీ దత్తా నానాపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ‘హౌస్‌ఫుల్‌ 4’ దర్శకుడు సాజిద్‌ ఖాన్‌పై కూడా ఆరోపణలు వస్తున్నాయి. తనపై ఆరోపణలతో  సాజిద్‌ ఈ చిత్రం నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.