ఫిలింఫేర్‌ అవార్డ్స్‌లో రణ్‌బీర్‌కి ఐ లవ్‌ యు చెప్పిన ఆలియా

ఫిలింఫేర్‌ అవార్డుల వేదికపై రణ్‌బీర్‌ కపూర్‌పై తనకున్న ప్రేమను ఆలియా భట్‌ వ్యక్తపరిచారు. ‘రాజీ’ సినిమాకు గానూ ఆలియా ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వేదికపైకి వెళ్లిన ఆమె తనకు అవార్డు రావడానికి కారణమైన వారికి ధన్యవాదాలు చెప్పారు. ‘నా దృష్టిలో ‘రాజీ’ అంటే మీరే మేఘనా (దర్శకురాలు). మీరు ఈ సినిమా కోసం ఎంతో శ్రమించారు. విక్కీ కౌశల్‌ మీరు లేనిదే.. ఈ సినిమా పరిపూర్ణం అయ్యేది కాదు. నా మెంటార్‌ కరణ్‌కు, నా తండ్రికి ధన్యవాదాలు. ఈ రాత్రి ప్రేమతో నిండిపోయింది. నాకు ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి.. ఐ లవ్‌ యు రణ్‌బీర్‌’ అని ఆలియా అందరి సమక్షంలో చెప్పారు. ఆమె అలా అనడంతో రణ్‌బీర్‌ ముఖానికి చేయి అడ్డుపెట్టుకుని మురిసిపోయారు. అంతేకాదు ఆమె వేదికపైకి వెళ్లడానికి ముందు రణ్‌బీర్‌ ముద్దు పెట్టారు. కొన్ని రోజుల క్రితం జరిగిన ఓ అవార్డుల వేడుకలో ఆలియా, రణ్‌బీర్‌ కలిసి డ్యాన్స్‌ చేశారు. ప్రస్తుతం ఈ జంట ఫొటోలు, వీడియోలతో ఇంటర్నెట్‌ నిండిపోయింది.

రణ్‌బీర్‌, ఆలియా ప్రేమలో ఉన్నారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని ఇద్దరు నటులు పరోక్షంగా ఒప్పుకున్నారు. కానీ ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని ఆలియా ఇటీవల మీడియాకు స్పష్టం చేశారు. ప్రస్తుతం తన దృష్టి కేవలం సినిమాలపైనే ఉందని అన్నారు. దీంతో వీరి పెళ్లి తంతు చూడాలంటే కొన్ని రోజులు వేచిచూడాల్సిందేనని బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి.