ట్రోలింగ్స్‌పై అమితాబ్‌ బచ్చన్ ఆగ్రహం

బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్ కుటుంబం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. 10 రోజులుగా ముంబైలోని లీలావతి హాస్పిటల్‌లో అమితాబ్‌, అభిషేక్‌ బచ్చన్‌లు కరోనాతో చికిత్సపొందుతున్నారు. వీరితో పాటు ఐశ్వర్య రాయ్, ఆరాధ్య కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఐశ్వర్య. ఆరాధ్య కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అమితాబ్, అభిషేక్ మాత్రం ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నారు. అమితాబ్ త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు పూజలు చేస్తున్నారు. బాలీవుడ్, టాలీవుడ్‌తో పాటు పలువురు ప్రముఖులు అమితాబ్ త్వరగా కోలుకోవాలని తమ ఆశాభావాన్ని సోషల్ మీడియాలో వెల్లడిస్తూనే ఉన్నారు.

అమితాబ్ కోలుకోవాలని దేశవ్యాప్తంగా అభిమానులు పూజలు, యజ్ఞాలు చేస్తుంటే కొందరు మాత్రం అమితాబ్ బచ్చన్‌పై ట్రోలింగ్ చేస్తున్నారు. అమితాబ్ కరోనాతో చనిపోవాలంటూ ట్రోల్ చేస్తున్నారు. దీనిపై అమితాబ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి నుంచే ఆ ట్రోలర్స్‌కు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చారు. తన బ్లాగులో ఓ బహిరంగ లేఖ రాశారు. ఇది వైరల్ అవుతోంది.

‘నీ వివరాలు కూడా వెల్లడించని ఓ వ్యక్తి.. నేను చచ్చిపోవాలని కోరుకున్న నీవు కనీసం నీ తండ్రి పేరు కూడా రాయలేదు.. అంటే నీకు నీ తండ్రి ఎవరో తెలియదన్నమాట.. ఇప్పుడు రెండు విషయాలు మాత్రమే జరిగే ఆస్కారం ఉంది. ఒకటి నేను మరణించడం… లేదంటే బతకడం. చచ్చిపోయాను అనుకో ఇకపై ఎలాంటి సెలబ్రిటిపైనా నువ్వు ఇలాంటి విమర్శలు చేయలేవు. దేవుడి దయవల్ల నేను బతికానే అనుకో నీవు పెద్ద తుపానును ఎదుర్కోవలసి వస్తుంది. దాదాపు 90 మిలియన్ల మంది నీపై దాడి చేస్తారు.. దానికి సిద్ధంగా ఉండు. నేను దీని గురించి ఇంకా వాళ్లకు చెప్పలేదు. వాళ్ల కోపం మొత్తం ప్రపంచాన్ని దాటుతుందని గుర్తు పెట్టుకో.. పశ్చిమం నుంచి తూర్పు వరకు.. ఉత్తరం నుంచి దక్షిణం వరకు వాళ్ల కోపం కట్టలు తెంచుకుంటే.. నా ఫ్యాన్స్ నా కుటుంబం లాంటి వారు. వారి ధాటికి మీరు తట్టుకోలేరు జాగ్రత్త అంటూ సీరియస్ అయ్యారు అమితాబ్. ప్రస్తుతం ఈయన రాసిన లేఖతో పాటు అమితాబ్ చనిపోవాలని కోరుకున్న వ్యక్తిని కూడా బిగ్‌బీ అభిమానులు బండ బూతులు తిడుతున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates