హీరోగా యాంకర్ రవి!

స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని స్టైలిష్ లుక్స్, మేనరిజమ్స్ తో బుల్లితెర ప్రేక్షకులను గత కొంతకాలంగా విశేషంగా అలరిస్తున్న రవి అలియాస్ యాంకర్ రవి అతి త్వరలో వెండితెరపై కథానాయకుడిగా పరిచయం కానున్నాడు. మత్స్య క్రియేషన్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి అయోధ్య కార్తీక్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న ఓ ఫీల్ గుడ్ లవ్ ఎంటర్ టైనర్ ద్వారా యాంకర్ రవి హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. “ఇది మా ప్రేమ కథ” అనే టైటిల్ నిర్ణయించబడిన ఈ చిత్రానికి “1>99” (1 ఈజ్ గ్రేటర్ దేన్ 99) అనేది ట్యాగ్ లైన్. కార్తీక్ కొడకండ్ల సంగీత సారధ్యం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. రవి సరసన ఇద్దరు అందాల భామలు నటించిన ఈ చిత్రాన్ని వేసవి కానుకగా ఏప్రిల్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలోని రవి ఫస్ట్ లుక్ ను ఓ ప్రముఖ సెలబ్రిటీ ఆన్ లైన్ లో విడుదల చేస్తారు. 

రవి ప్రధాన పాత్రలో నటించిన ‘థాంక్యూ మిత్రమా’ సినిమా విశేష ఆదరణ పొందింది. రాకేష్ సిల్వర్ అనే యువ దర్శకుడు డైరెక్ట్ చేసిన ఈ సినిమా క్లాప్ బోర్డ్ ప్రొడక్షన్స్ లో నిర్మించారు. ఈ సినిమాతో పాటు రవి నటించిన మరికొన్ని షార్ట్ ఫిల్మ్స్ నచ్చడంతోనే రవిని హీరోగా పరిచయం చేయడానికి నిర్మాతలు సిద్ధపడినట్లు తెలుస్తోంది.