నిర్మాత పైశాచికత్వం.. మీ టూ.. మీరే నా సూపర్‌ హీరోస్‌

ప్రముఖ నటి ఆశా(ఫ్లోరా) షైనీ ఫేస్‌బుక్‌ వేదికగా తన పట్ల జరిగిన దారుణాన్ని బయటపెట్టారు. తన మాజీ ప్రియుడు, నిర్మాత గౌరంగ్‌ దోషి తన పట్ల పైశాచికత్వాన్ని ప్రదర్శించాడని ఆరోపిస్తున్నారు. తనపై చేయిచేసుకున్నాడని వెల్లడిస్తూ గాయాలైనప్పుడు తీసిన ఫొటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. ముఖం అంతా కందిపోయినట్లుగా ఉన్న ఫ్లోరా షైనీ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

‘అది నేనే. 2007 ప్రేమికుల దినోత్సవం నాడు గౌరంగ్‌ దోషి నన్ను దారుణంగా కొట్టాడు. ఏడాది పాటు నాకు నరకం చూపించాడు. దాని ఫలితంగానే నా ముఖంపై చెరిగిపోని గాట్లు పడ్డాయి. ఆ సమయంలో నేను ఈ విషయాలన్నీ బయటపెట్టాను. కానీ నన్ను ఎవ్వరూ నమ్మేవారు కాదు. ఎందుకంటే అప్పట్లో గౌరంగ్‌కు బాగా పలుకుబడి ఉండేది. నాకు సినిమా అవకాశాలు రానివ్వకుండా చేస్తానని చాలా సార్లు బెదిరించాడు. కొన్ని సందర్భాల్లో నన్ను సినిమాల్లోకి తీసుకున్నట్లే తీసుకుని తొలగించిన రోజులూ ఉన్నాయి. నన్ను ఆడిషన్స్‌కు కూడా పిలవడానికి ఇష్టపడేవాళ్లు కాదు’

ఆ క్షణాన నేను నోరుతెరవకుండా ఉండాల్సింది అనిపించింది. కేవలం నా ప్రతిభ చూసి అవకాశాలు ఇచ్చే వారు ఎవరైనా ఉంటే వారి వద్దకు పారిపోయి తలదాచుకోవాలని అనుకున్నాను. నేనే కాదు నాలాంటి ఎందరో ఆడవాళ్లు గౌరంగ్‌ కారణంగా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. వారంతా నాకు ఫోన్లు చేసి సాయం చేయమని అడిగారు. కానీ నేను ఆ ధైర్యం చేయలేకపోయాను. తమ పట్ల జరిగిన దారుణాల గురించి బయటపెడుతున్నవారి కోసం నేను ఈ పోస్ట్‌ పెడుతున్నాను.’

‘మీరే నా సూపర్‌ హీరోస్‌. మీలాంటి వారు సమాజానికి ఎంతో అవసరం. గౌరంగ్‌ వల్ల నా జీవితంలో చాలా నష్టపోయాను. ఆ ఘటన తర్వాత నా జీవితంలో నేను బాగుచేయలేని మార్పులు చోటుచేసుకున్నాయి. కానీ ఆ దేవుడి ముందు ఎవ్వరూ ఎక్కువ కాదు అని నమ్మేదాన్ని. నిజాన్ని నమ్ముకోండి. దాన్ని ఆయుధంలా ధరించండి. మళ్లీ మనమంతా సంతోషంగా ఉందాం. ఇలాంటి వారి నుంచి మనల్ని మనం కాపాడుకుందాం’ అని వెల్లడించారు ఫ్లోరా.