‘రానా దగ్గుబాటి జయహో.. జయహో..’ జపాన్‌లో అభిమానుల సందడి

‘రానా దగ్గుబాటి జయహో.. జయహో..’ అంటూ తెగ కేకలు పెడుతున్నారు జపాన్‌ అభిమానులు. టోక్యోలో అభిమానుల కోసం ఆదివారం ‘బాహుబలి’ ప్రత్యేక స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేశారు. ఈ షో చూస్తున్న ప్రేక్షకులు థియేటర్‌లో సంబరంతో తెగ గోల చేస్తున్న వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. రానా అభిమానులు ‘భళ్లాలదేవ జయహో.. రానా దగ్గుబాటి జయహో..’ అని కేకలు పెడుతూ కనిపించారు. థియేటర్‌ మొత్తం రంగు కాగితాలతో నిండిపోయింది. అంతేకాదు చాలా మంది ‘బాహుబలి’ లోని వివిధ పాత్రల గెటప్‌లలో రెడీ అయ్యారు.

‘బాహుబలి’ సినిమా జపాన్‌లో అద్భుతమైన విజయం సాధించింది. అక్కడ అత్యధిక రోజులు ఆడిన భారత సినిమాగానూ రికార్డు సృష్టించింది. ఈ సినిమా తర్వాత జపాన్‌లో ఎస్‌.ఎస్‌. రాజమౌళి, ప్రభాస్‌, రానా, సుబ్బరాజు తదితరులకు అభిమానులు ఏర్పడ్డారు. ఇప్పటికే జక్కన్న, రానా, సుబ్బరాజు విడివిడిగా జపాన్‌కు వెళ్లి, అక్కడి అభిమానుల్ని కలిశారు. వీరికి ఫ్యాన్స్‌ ఘన స్వాగతం పలికారు. ఎన్నో కానుకలు ఇచ్చి భారత్‌కు పంపారని రానా ఇటీవల సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. అక్కడి ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు చెప్పారు.