చరణ్, బన్నీ సినిమాల్లో బేబీకి అవకాశం.. చిరంజీవి దంపతులతో బేబీ

తూర్పుగోదావరి జిల్లా వడిసెలేరు గ్రామానికి చెందిన 40 సంవత్సరాల బేబీ అనే మహిళ పొలం పనులు చేసుకుంటూ జీవించేంది. ఆమెలో ఉన్న అద్భుతమైన సింగింగ్ టాలెంట్ సోషల్ మీడియా ద్వారా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఏఆర్ రెహమాన్ ఆమె వీడియో షేర్ చేయడంతో విషయం అందరికీ తెలిసింది. ఈ విషయం తెలిసి మెగాస్టార్ చిరంజీవి దంపతులు సంగీత దర్శకుడు కోటి ద్వారా ఆమెను తన ఇంటికి పిలిపించి అభినందించారు. మెగా దంపతులను కలిసిన అనంతరం బేబీ ఓ ఇంటర్వ్యూలో వారు తనను ట్రీట్ చేసిన విధానం గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. చిరంజీవి అంటే చాలా ఇష్టం, అన్నయ్యలా భావిస్తాం. మా ఫ్యామిలీ మొత్తం ఆయనకు అభిమానులమే. కోటిగారికి మా వదినమ్మ సురేఖ మేడమ్ ఫోన్ చేసి బేబీని కలవాలి, ఆవిడను ఇక్కడికి పంపించగలరా? అని అడిగారట. ఈ విషయం కోటి సర్ నాకు చెప్పగానే ఎగిరిగంతేశాను అని బేబీ గుర్తు చేసుకున్నారు. చిరంజీవిగారు నా కోసం ఆయన విలువైన సమయం కేటాయించారు. ఆ దేవుళ్లు ఇద్దరూ నన్ను కూర్చో బెట్టి మాట్లాడటం నా అదృష్టంగా భావిస్తున్నాను.

వారు నాతో మాట్లాడుతుంటే స్వర్గంలో ఉన్నట్లు అనిపించింది. ఆ ఆనందంలో కళ్లవెంట నీళ్లు వచ్చేశాయి. నా సొంత చుట్టాలను చూసినట్లు, నా అన్నయ్యను చూసినట్లు ఫీలయ్యాను. సొంత మనిషిలా మాట్లాడారు.. అని బేబీ గుర్తు చేసుకున్నారు. సైరా సినిమా ఆల్రెడీ మొదలైంది కాబట్టి ఈ సినిమాలో అవాకశం ఉండక పోవచ్చు అన్నారు. రామ్ చరణ, బన్నీ సినిమాలో తప్పకుండా అవకాశం ఇప్పిస్తామని చెప్పారు. వాళ్ల సినిమాలో తప్పకుండా అవకాశం దొరుకుతుందని ఆశ పడుతున్నాను.. అని బేబీ తెలిపారు. చిరంజీవి గారికి నేను ఫ్యాన్ అయితే సురేఖగారు నాకు ఫ్యాన్. నా పాట రోజూ వినేవారట. ఆమె నాతో ఆ విషయం చెబుతుంటే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఎంతో మంది గొప్ప సింగర్లు ఇండస్ట్రీలో ఉన్నారు. కానీ ఇది నా గొప్పతనం కాదు. సురేఖగారు నా పాట ఇష్టపడటం ఆమె గొప్పతనమని బేబీ అన్నారు. ఏదైనా సినిమా ఫంక్షన్ జరిగినపుడు నన్ను తప్పకుండా తీసుకురావాలని కోటిగారిని అడిగారు. నేను మళ్లీ చిరంజీవిగారి ఇంటికి తప్పకుండా వెళతాను అనే నమ్మకం ఉంది.. అంటూ ఆనందం వ్యక్తం చేశారు బేబీ.