HomeTelugu Newsగోదావరి గర్భంలోనే లాంచి.. మృతదేహాల కోసం గాలింపు

గోదావరి గర్భంలోనే లాంచి.. మృతదేహాల కోసం గాలింపు

10 13గోదావరిలో ఈ నెల 15న కచ్చలూరు వద్ద జరిగిన లాంచి ప్రమాదంపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో లాంచిలో 8 మంది సిబ్బంది సహా 73 మంది ఉన్నట్లు అధికారులు లెక్కలువేశారు. అసలు ఎంతమంది ఉన్నారన్నది స్పష్టంగా ప్రకటించలేదు. టిక్కెట్లు తీసుకున్నవారంతా ప్రయాణించారా లేక టిక్కెట్లు తీసుకోకుండా ఎవరైనా ప్రయాణించారా.. వంటి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం జరిగినప్పుడు దగ్గర్లోని జాలర్లు బోట్లలో వచ్చి లైఫ్ జాకెట్లతో నీటిలో తేలుతున్న 26 మందిని కాపాడారు. NDRF, SDRF, నేవీ బృందాల గాలింపులో 34 మృతదేహాలు వెలికి తీశారు.

మిగతా వారు లాంచిలో చిక్కుకుని ఉంటారని చెబుతున్నారు. లాంచి గోదావరి గర్భంలో 250 అడుగుల లోతున ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. గోదావరిలో నీటి ఉధృతి, భారీ వర్షంతో గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోంది. లాంచీని వెలికి తీసేందుకు ముంబై నుంచి మెరైన్ నిపుణుడు భక్షి, కాకినాడ నుంచి ధర్మాడి సత్యం మత్స్యకారుల బృందాలు, నేవీ బృందాలు కలిసి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఉత్తరాఖండ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సైడ్ స్కాన్ సోనార్ మెషీన్ ద్వారా బోటు జాడ గుర్తించారు. బోటు ఏ ప్రదేశంలో ఉంది అన్నదానిపై కూడా స్పష్టత వచ్చింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో లోతు ఎక్కువగా ఉండటం, సమీపంలో కొండ ఉండటంతో సుడులు ఎక్కువగా ఉన్నాయని, దీంతో లాంచి బయటకు తీసే ప్రక్రియ ఆలస్యమవుతుందని అంటున్నారు. లాంచిని బయటకు తీస్తేనే మొత్తం ఎంతమంది ఉన్నారనేది తెలుస్తుందని చెబుతున్నారు.

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు ప్రమాదంపై విచారణకు ఏపీ ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. జలవనరుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. 9 అంశాలపై విచారణ జరపాలని ప్రభుత్వం నిర్ధేశించింది. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కమిటీ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. 21 రోజుల్లో ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu