విక్రమ్ తో బన్నీ ప్లాన్!

హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలో నటిస్తోన్న అల్లు అర్జున్ ఈ సినిమా పూర్తయిన వెంటనే వక్కంతం వంశీ దర్శకత్వంలో మరో సినిమా పట్టాలెక్కించనున్నాడు. అయితే ఈ సినిమా తరువాత తమిళ దర్శకుడు లింగుస్వామి, బన్నీతో సినిమా చేయడానికి లైన్ లో ఉన్నారు. కానీ ఇప్పుడు బన్నీ కన్ను మాత్రం మరో దర్శకుడిపై పడింది. అతడే విక్రమ్ కె కుమార్. ప్రస్తుతం ఆయన అఖిల్ రెండో సినిమాతో బిజీగా ఉన్నాడు. అయినప్పటికీ అల్లు అర్జున్ పిలిచి మరీ ఓ కథ సిద్ధం చేయమని విక్రమ్ కు చెప్పినట్లు తెలుస్తోంది. 
తెలుగు, తమిళ బాషల్లో విక్రమ్ కు మంచి గుర్తింపు ఉంది. హిందీకి కూడా అతడు సుపరిచితులే. తన కథనంతో ప్రేక్షకులను కట్టిపడేసే ఈ డైరెక్టర్ తో సినిమా చేయాలనేది బన్నీ ప్లాన్. అది కూడా మామూలు సినిమా కాదు.. ఓ భారీ బడ్జెట్ సినిమా అని తెలుస్తోంది. బన్నీకు మలయాళంలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో విక్రమ్ ను అన్ని భాషలకు తగ్గ విధంగా మంచి హెవీ సబ్జెక్ట్ ను రెడీ చేయమని చెప్పాడట. ఈ సినిమాతో వంద కోట్ల మార్కెట్ లోకి అడుగుపెట్టాలనేది ఈ స్టైలిష్ స్టార్ ప్లాన్. అంతా బాగానే ఉంది గానీ మరి వంద కోట్ల బిజినెస్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో.. చూడాలి!