కంగనాపై పరువు నష్టం దావా!

గత కొంత కాలంగా సంచలన ఆరోపణలతో తరచూ వార్తల్లో నిలుస్తుంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్. హృతిక్ రోషన్ తనను ప్రేమించి మోసం చేశాడని, కావాలని వదిలించుకున్నాడని చాలా ఆరోపణలు చేసింది. అలానే కెరీర్ ఆరంభంలో ఆదిత్య పంచోలి లైంగికంగా తనను వేధించాడని చెప్పుకొచ్చింది. దీంతో రియాక్ట్ అయిన ఆదిత్య పంచోలి తన మీద ఆరోపణలు చేసిన కంగనా, అలానే ఆమె సోదరిపై పరువు నష్టం దావా కేసుని పెట్టాడు. కోర్టులో తన భార్యతో కలిసి పిటిషన్ దాఖలు చేశాడు ఆదిత్య పంచోలి. కంగనా, తన సోదరి రంగోలి కలిసి తన మీద చేస్తోన్న ఆరోపణల కారణంగా తన పరువుకి భంగం వాటిల్లుతుందని, తమ మాటలతో వేధిస్తున్నారని కంప్లైంట్ లో పేర్కొన్నారు. వారిద్దరిపై తగిన చర్యలు తీసుకొని శిక్షించాలని కోర్టుని కోరాడు ఆదిత్య పంచోలి. 
నిజానికి కంగనా.. ఆదిత్యపై చేసిన ఆరోపణలు ఆయన ఇదివరకే ఖండించారు. అయితే ఆమె సోదరి రంగోలి.. ఆ ఆరోపణలు నిజమేనంటూ బహిరంగంగా చెప్పుకొచ్చింది. ఆదిత్యతో పాటు హృతిక్ కూడా కంగనాను వేధించారని వెల్లడించింది. దీంతో ఆదిత్య వీరిద్దరిపై కేసు దాఖలు చేశాడు. ఇంకా.. హృతిక్ కేసు నుండి బయటపడని కంగనాకు ఇప్పుడు మరో కేసు చుట్టుముట్టింది. మరి వీటి నుండి ఆమె ఎలా బయటపడుతుందో.. చూడాలి!