టీడీపీ నేతలను చంద్రబాబు కన్‌ఫ్యూజ్ చేస్తున్నారా?


ఏపీలో ఎన్నికల ఫలితాలపై రాజకీయ పార్టీలు ఎవరికి వారే మాదే గెలుపంటే మాదే గెలుపంటూ డబ్బా కొట్టుకుంటున్నారు. ఎన్నికల తరువాత ఇలాంటి వ్యాఖ్యలు, నమ్మకాలు రాజకీయ పార్టీలకు ఉండటం సహజమే. అయితే ఈ విషయంలో ఈ సారి ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్న తీరు సొంత పార్టీ శ్రేణులను కన్ఫ్యూజ్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ఎన్నికలు పూర్తయిన మరుసటి రోజు మీడియా ముందుకు వచ్చిన చంద్రబాబు… ఎన్నికలు జరిగిన తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఎన్నికల కమిషన్ చేసిన తప్పులకు తాము శిక్ష అనుభవించాలా అంటూ పరోక్షంగా తాము ఓడిపోతామేమో అనే కోణంలో వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ శ్రేణుల్లో ఆందోళన కలిగే అవకాశముందని అంటున్నారు. అయితే అంతలోనే తమ పార్టీకి 130 సీట్లు వస్తాయని… మరోసారి అధికారం తమదే అని నమ్మకంగా చెప్పారు. ఆ తరువాత పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో మరోసారి మనదే అధికారం అంటూ ధీమా వ్యక్తం చేసిన చంద్రబాబు… అంతలోనే ఈ నెల 2 నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఎన్నికల తీరు, టీడీపీ గెలుపుపై సమీక్ష చేపడతామని చెప్పి టీడీపీ శ్రేణుల్లో మరోసారి గందరగోళానికి తెరలేపారు.

ఓ వైపు ఎన్నికల్లో ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని అంటూనే మరోవైపు టీడీపీ ఘనవిజయం సాధిస్తుందని చంద్రబాబు చెబుతున్న మాటలు… రాజకీయవర్గాలతో పాటు సొంత పార్టీ నేతలను కూడా తికమకపెడుతున్నట్టు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక తాజాగా రూ. 10 కోట్లు ఇస్తే ఈవీఎంలను హ్యాక్ చేసేందుకు కొందరు సిద్ధంగా ఉన్నారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. అయితే చంద్రబాబు రోజుకో విధంగా మాట్లాడుతుండటంతో… తాము నిజంగా గెలుస్తామో లేదో అనే గందరగోళం టీడీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోందనే టాక్ వినిపిస్తోంది.