మరోసారి అధికారం చేపట్టబోతున్నాం

కర్నూలు జిల్లా ఓర్వకల్లులో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పర్యటించారు. కర్ణాటకలోని రాయచూర్‌లో ఎన్నికల ప్రచారానికి వెళుతూ కర్నూలు విమానాశ్రయానికి సీఎంచేరుకున్నారు. రాక్ గార్డెన్స్‌లో జిల్లా ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపు అవకాశాలపై నేతలను సీఎం అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాతివనాలను సీఎం సందర్శించారు. ఆ తర్వాత రాయచూర్ బయల్దేరి వెళ్లారు. జిల్లాలో పార్టీ పరిస్థితి చాలా బాగుందని.. మెజార్టీ స్థానాలు గెలుచుకుంటామని నాయకులు చంద్రబాబుకు చెప్పినట్లు జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. వందశాతం అధికారంలోకి వస్తామని సీఎం తమతో అన్నారని ఆయన చెప్పారు.

కడప జిల్లా ఒంటమిట్టలో గురువారం నిర్వహించిన కోదండరామ స్వామి కల్యాణోత్సవానికి సీఎం హాజరయ్యారు. ఈ ఉదయం కడప ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆ జిల్లా నేతలతో సమావేశమయ్యారు. జిల్లాలో ఎన్ని స్థానాలు కైవసం చేసుకుంటున్నామని పార్టీ నేతలను అడిగి తెలుసుకున్నారు. గతంలో కంటే మెరుగైన స్థానాలు గెలుస్తామని జిల్లా నేతలు చంద్రబాబుకు చెప్పినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగానూ తెలుగుదేశం పార్టీకి గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయని.. మరోసారి అధికారం చేపట్టబోతున్నట్లు ఆయన ధీమా వ్యక్తం చేసినట్లు తెలిసింది.