‘రజనీ మక్కల్‌ మంద్రం’ ఉచితంగా నీటి సరఫరా.. ఫొటోలు వైరెల్

తమిళనాడులోని ప్రజలు నీటి ఎద్దడితో సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొన్ని కార్పొరేట్‌ సంస్థలు నీటి సమస్యతో ఇంటి నుంచే పనిచేయాలని ఉద్యోగులకు సూచించాయి. కాగా ఈ సమస్య నుంచి ప్రజలకు కాస్త ఊరట కల్గించేందుకు రజనీకాంత్‌ ఫ్యాన్స్‌ ముందుకొచ్చారు. ఆయన అభిమానుల సంఘాల వేదిక ‘రజనీ మక్కల్‌ మంద్రం’ శనివారం ఉచితంగా నీటిని సరఫరా చేసింది. ట్యాంకర్ల ద్వారా చెన్నైలోని కోడంబాకం ప్రాంతంలోని ప్రజలకు నీరు సరఫరా చేసింది. దీంతో అక్కడి ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

చెన్నైకు నీటిని అందించే జలాశయాలు అడుగంటడంతో నీటి ఎద్దడి నెలకొంది. మరోపక్క తమిళనాడులో నీటి సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి పళనిస్వామి చర్యలు తీసుకుంటున్నారు. రైళ్ల ద్వారా చెన్నైకు తాగునీటిని తీసుకొచ్చేందుకు రూ.65 కోట్లు కేటాయించినట్టు చెప్పారు.