అన్నయ్య కోసం ఈసారి వీలు చేసుకుంటాడా..?

చిరంజీవి నటించిన ‘ఖైదీ నెంబర్ 150’ వ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. చిరు రీఎంట్రీ సినిమా కావడంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇప్పుడు ప్రేక్షకుల నుండి వస్తోన్న స్పందన చూసి చిరంజీవి సైతం ఈ స్థాయి రెస్పాన్స్ ను ఊహించలేదని అన్నారు. ఇప్పటికే 78 కోట్ల వరకు వసూళ్లు సాధించిన ఈ సినిమా ఇప్పుడు వంద కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. ఇప్పుడు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో జోష్ మరింత పెంచాలని చిత్రబృందం మరో ప్లాన్ వేసింది.

సినిమా సక్సెస్ మీట్ ను భారీగా నిర్వహించాలనేది ప్లాన్. ప్రీరిలీజ్ ఫంక్షన్ తో ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేసిన సినిమా టీం ఇప్పుడు మరో భారీ ఈవెంట్ చేయడానికి రెడీ అవుతోంది. ఈసారి హైదరాబాద్ లోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మెగా హీరోలందరు హాజరు కానున్నారు. తమ్ముడు పవన్ కల్యాణ్ ను ప్రత్యేకంగా ఆహ్వానించాలని చిరు అనుకుంటున్నాడు. ప్రీరిలీజ్ ఫంక్షన్ కు కూడా పవన్ రావాల్సింది కానీ షూటింగ్ లో ఉండడం వలన కుదరలేదు. అప్పుడే పవన్ పై చాలా విమర్శలు వినిపించాయి. మరి ఇప్పుడు కూడా పవన్ రాకపోతే అభిమానులు బాధపడే అవకాశాలు ఉన్నాయి. పవన్ వచ్చి వారిని సంతోష సంబరాల్లో ముంచుతాడో.. లేదో.. చూడాలి!