HomeTelugu Newsకరోనా కేసుల తగ్గుదల శుభసూచకం: కేసీఆర్‌

కరోనా కేసుల తగ్గుదల శుభసూచకం: కేసీఆర్‌

9 25
సీఎం కేసీఆర్‌.. రాబోయే కొద్దిరోజుల్లోనే కరోనా పాజిటివ్‌ కేసులు లేని రాష్ట్రంగా తెలంగాణ మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వ్యాప్తి తగ్గుదల శుభసూచకమని చెప్పారు. రేపటికి 21 జిల్లాల్లో ఒక్క కరోనా యాక్టివ్‌ కేసు కూడా లేనివిధంగా మారుతున్నాయని సీఎం ప్రకటించారు. ఈ వైరస్‌ సోకిన వారిలో 97 శాతానికి పైగా రోగులు కోలుకుని డిశ్చార్జ్‌ అవుతుండటం మంచి పరిణామమని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ, లాక్‌డౌన్‌ పరిస్థితులు, భవిష్యత్‌ కార్యాచరణపై ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. పలువురు మంత్రులతో పాటు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు.

వైరస్ వ్యాప్తి, ప్రభావం బాగా తగ్గుతున్నందున రాష్ట్రంలో కంటైన్‌మెంట్ల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతున్నట్లు సీఎం చెప్పారు. మర్కజ్ వెళ్లి వచ్చిన వారి ద్వారా వైరస్ సోకుతున్న వారి లింక్ మొత్తం గుర్తించి, అందరికీ పరీక్షలు నిర్వహించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ప్రజలెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని.. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలోని ట్రెండ్‌ చూస్తుంటే వైరస్‌ వ్యాప్తి చాలా వరకు తగ్గిందన్నారు. ఏదైనా అనుకోని పరిస్థితుల్లో మళ్లీ పాజిటివ్ కేసులు వచ్చినా, వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవడానికి వైద్య ఆరోగ్య శాఖ అన్ని విధాలా సంసిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.

గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో కరోనా వైరస్ సోకుతున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు. సోమవారం 159 మందికి పరీక్షలు నిర్వహించగా, కేవలం ఇద్దరికి మాత్రమే పాజిటివ్ వచ్చిందని..16 మందిని డిశ్చార్జ్‌ చేసినట్లు సీఎంకు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నిబంధనలు కచ్చితంగా అమలు చేయడం వల్ల వైరస్ వ్యాప్తిని సమర్థంగా అరికట్టగలుగుతున్నట్లు చెప్పారు. మొదట విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా, తర్వాత మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారి ద్వారా వైరస్ మన రాష్ట్రంలో ఎక్కువ ప్రాంతాలకు పాకిందన్నారు. అయితే పోలీసులు, వైద్య ఆరోగ్యశాఖ వారి లింకులన్నింటినీ గుర్తిండంతో పాటు పరీక్షలు నిర్వహించి చికిత్స అందించడంతో మంచి ఫలితాలు వచ్చాయన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu