వివాదంలో దీపికా-రణ్‌వీర్‌ వివాహం

బాలీవుడ్‌ నూతన దంపతులు దీపికా పదుకోన్‌ – రణ్‌వీర్‌ సింగ్‌. దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమ పక్షులుగా విహరించిన వీరు తాజాగా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇట‌లీలోని లేక్ కోమో వేదిక‌గా ఈ నెల 14, 15 తేదీల్లో దీప్‌వీర్‌ల వివాహం అంగరంగా వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఒక్క ఫోటో కూడా బయటకు రాకుండా జాగ్రత‍్త పడ్డారు ఈ జంట. ఇంత అట్టహసంగా జరిగిన వీరి వివాహంపై వచ్చిన ఓ వివాదం ఇప్పుడు జంటను ఇబ్బందులకు గురి చేస్తోంది.

అసలు విషయం ఏంటంటే.. కొంకణీ సంప్రదాయం ప్రకారం నవంబర్‌ 14న వివాహం చేసుకున్న దీప్‌వీర్‌లు ఆ త‌ర్వాత నిర్వ‌హించిన ‘ఆనంద్ కరాజ్’ అనే కార్య‌క్ర‌మాన్ని మాత్రం సరిగా జ‌ర‌పలేద‌ని ఇటాలియ‌న్ సిక్ ఆర్గ‌నైజేష‌న్ అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. సిక్కుల కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించి మరీ ఈ వేడుకను నిర్వహించారని పేర్కొంది. సిక్కుల పవిత్ర గ్రంథమైన ‘గురు గ్రంథ్ సాహిబ్’ను గురుద్వారాలో తప్ప మరెక్కడా తీసుకోకూడదని, కాని వారు ఆ నియమాన్ని ఉల్లంఘించారని ఆరోపించింది. ఈ విషయాన్ని ‘అకల్ తఖ్త్ జతేదార్’ దృష్టికి తీసుకెళ్లినట్టు సంస్థ అధ్యక్షుడు తెలిపారు. జీవితాంతం గుర్తిండిపోయే ఈ వేడుక ఇలా వివాదాల పాలు కావడం నూతన దంపతులను కాస్తా ఇబ్బందికర అంశమే అంటున్నారు సన్నిహితులు.