డ్రామా జూనియర్స్ గోకుల్‌ మృతి.. బాలకృష్ణ సంతాపం

చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన టీవీ ఆర్టిస్ట్‌, బాలనటుడు గోకుల్‌ సాయికృష్ణ(9) డెంగీ జ్వరంతో మృతిచెందాడు. పట్టణంలోని ఏవీ నాయుడు కాలనీకి చెందిన కందుకూరి యోగేంద్రబాబు కుమారుడైన గోకుల్‌సాయి బెంగళూరులోని రెయిన్‌బో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి 10.30గంటలకు మరణించాడు. గోకుల్‌సాయి చిన్నతనం నుంచే సినిమా డైలాగులు చెబుతూ ఆకట్టుకునేవాడు. మదనపల్లెలో జరిగిన పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచాడు. ఆర్టిస్ట్‌గా రాణిస్తున్న గోకుల్‌ మృతిచెందడంతో పాఠశాల ఉపాధ్యాయులు, సహచర విద్యార్థులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఇటు ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ కూడా గోకుల్‌ మృతిపై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

గతంలో గోకుల్ తన అభిమాన హీరో బాలకృష్ణను కూడా కలిసి ఆశీస్సులు అందుకున్నాడు. ఇప్పుడు గోకుల్ లేడని తెలియడంతో బాలయ్య తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మాకు అభిమానుల కంటే విలువైనది మరొకటి ఉండదు. అలాంటి చిన్నారి అభిమాని గోకుల్. నేనంటే ప్రాణం ఇచ్చే ఈ చిన్నారి ఈ రోజు ప్రాణాలతో లేడన్న నిజం నా మనసును కలచివేసింది. అతడు డైలాగులు చెప్పిన విధానం.. హావభావాలు చూసి నాకు ఎంతో ముచ్చటేసేది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ చిన్నారి ఇంత చిన్న వయసులో డెంగ్యూ వ్యాధితో ఈ లోకాన్ని విడిచి వెళ్లడం చాలా బాధ కలిగించింది. ఈ చిన్నారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అంటూ బాలయ్య ఒక సంతాప సందేశాన్ని విడుదల చేశారు.