నాకు ఆ వ్యాధి ఉంది.. అయినా సంతోషంగానే జీవిస్తున్నా: బిగ్‌బి

బాలీవుడ్‌ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌ తాను హెపటైటిస్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించారు. అయినప్పటికీ తాను సంతోషంగానే జీవిస్తున్నానని అంటున్నారు. ఈ వ్యాధి ఉన్న మహిళలను సమాజంలో చులకనగా చూస్తుంటారని, అది తనను కలచివేస్తోందని తెలిపారు. వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ తరఫున దక్షిణాసియా ప్రాంతంలో హెపటైటిస్‌ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు అమితాబ్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ముంబయిలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో అమితాబ్‌ మాట్లాడుతూ..

‘మహిళలను ఏ విషయంలోనైనా తక్కువ చేసి చూస్తే నాకు చాలా బాధేస్తుంది. ఇది ఎప్పుడూ జరగకూడదు. ఈ దేశానికి సగం శక్తి మహిళలే. వారే మన బలం. మహిళలకు ఇవ్వాల్సిన గౌరవ, మర్యాదలు ఇచ్చి తీరాలి. ఈ దేశంలో హెపటైటిస్‌ వ్యాధి సోకిన మహిళలు ఉన్నారు. అంతమాత్రాన వారిని కించపరుస్తున్నట్లు మాట్లాడకూడదు. వారికీ మర్యాద ఇవ్వాలి. నేను బతికున్నంతవరకు దీని కోసం పోరాడతాను. హెపటైటిస్‌ ఉందని ఇంట్లో నుంచి మహిళలను గెంటేసిన సంఘటనల గురించి కూడా నేను విన్నాను. నన్ను గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా నియమించినందుకు నా మాటలు విని కొందరికైనా అవగాహన కలిగితే నాకు అంతే చాలు. నేను హెపటైటిస్‌తో బాధపడుతున్నప్పటికీ సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాను’ అని పేర్కొన్నారు బిగ్‌బి.