మా అమ్మకు ఫోన్‌ చేయకండి: చిన్మయి

ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద తమిళనాడుకు చెందిన మీడియా వర్గాలకు ఓ విన్నపం చేశారు. ఎందరో మహిళలు తాము ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల గురించి బయటపెట్టడానికి చిన్మయి సాయం కోరుతున్నారు. చిన్మయి ద్వారా తమకు జరిగిన అవమానాలను బయటపెడుతున్నారు. దాంతో చిన్మయితో మాట్లాడాలని, ఆమె ఇంటర్వ్యూలు తీసుకోవాలని మీడియా ఛానెళ్లు భావిస్తున్నాయి. కానీ చిన్మయి మీడియా నుంచి వచ్చే ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లిఫ్ట్‌ చేయడంలేదు.

దాంతో మీడియా వర్గాలు చిన్మయి తల్లికి పదే పదే ఫోన్లు చేస్తూ ఆమెను విసిగిస్తున్నారట. ఈ విషయాన్ని చిన్మయి ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘చెన్నైకు చెందిన మీడియా వర్గాలకు విన్నపం. మాటిమాటికీ మా అమ్మకు ఫోన్‌ కాల్స్‌ చేసి ఆమెను ఇబ్బందిపెట్టకండి. ఫోన్లు చేయడం మానుకోండి. ఆమె వయసు 69. మీ కారణంగా ఆమె ఒత్తిడికి గురవుతున్నారు. దయచేసి మా అమ్మకు ఫోన్‌ చేయకండి. ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. చిన్మయి ఇటీవల ప్రముఖ గీత రచయిత వైరముత్తుపై లైంగిక ఆరోపణలను గుప్పించడం ప్రకంపనలు సృష్టిస్తోంది.