దాదాసాహెబ్ ఫాల్కేపై డాక్యుమెంటరీ!

భారతదేశంలో మొట్టమొదటి మూకీ సినిమాను తెరకెక్కించిన దర్శకనిర్మాత దాదాసాహెబ్ ఫాల్కే. ఆయనను ‘ఫాదర్ ఆఫ్ సినిమా’ గా పిలుస్తుంటారు. ‘రాజా హరిశ్చంద్ర'(మరాఠీ) అనే తొలి మూకీ సినిమాను తెరకెక్కించిన ఆయన గురించి ఇప్పుడు ఓ డాక్యుమెంటరీ రాబోతుందని సమాచారం. ఎందరో చరిత్రకారుల జీవితాల ఆధారంగా సినిమాలు తెరకెక్కించి నవతరానికి వారి గొప్పతనాన్ని చెబుతున్నారు. సినిమా పుట్టుకకు కారకుడైన దాదాసాహెబ్ గురించి కూడా చాలా తక్కువ మందికి 
మాత్రమే తెలుసు. అలాంటి వారికి ఫాల్కే గురించి తెలియజెప్పడానికి ఈ డాక్యుమెంటరీను తెరకెక్కించనున్నారట. జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు రాజేష్ మాపుస్కార్.. ఫాల్కేపై డాక్యుమెంటరీ తీయడానికి సిద్దమవుతున్నారు.
 
దాని కోసం ఓ మరాఠీ మంత్రిని కూడా ఆయన సంప్రదించినట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత అశుతోష్ గోవారికర్ సాయంతో ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు. అసలు రాజా హరిశ్చంద్ర సినిమా ఎలా మొదలైంది..? దానికి కారకుడైన ఫాల్కే సినీ ప్రస్థానం ఎలా సాగింది..? వంటి విషయాలను చూపించబోతున్నారు. అయితే ఈలోగా 55 సెకన్ల వీడియోను చిత్రీకరించి ట్రిబ్యూట్ గా దాదాసాహెబ్ ఫాల్కేకు అంకితం ఇవ్వనున్నారు. ఫాల్కే పాత్రలో సన్నీ పవార్ నటించనున్నారు. అయితే రాజేష్ దీన్ని డాక్యుమెంటరీగానే రూపొందిస్తాడా..? లేక సినిమా చేసే ఆలోచన ఏమైనా ఉందా..? అనే విషయాన్ని వెల్లడించాల్సి వుంది. గతంలో కూడా ఫాల్కే జీవితంపై హరిశ్చంద్ర ఫ్యాక్టరీ అనే సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.